ఏపీ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంకు ఝలక్.. 6 వేల 500 కోట్ల ఓవర్ డ్రాప్ట్ తిరస్కరణ
కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేయడానికి 6వేల 500కోట్ల అదనపు నిధులను అడిగిన ఏపీ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పచెల్లు మనిపించింది.
- Author : Hashtag U
Date : 01-10-2021 - 3:36 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేయడానికి 6వేల 500కోట్ల అదనపు నిధులను అడిగిన ఏపీ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పచెల్లు మనిపించింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని, ఎస్క్రో అకౌంట్ల గురించి తెలియచేస్తూ ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శ సత్యనారాయణ ఈనెల మొదటి వారంలో బ్యాంకు కు లేఖ రాశారు. ఓవర్ డ్రాఫ్ట్ కింద 6వేల 500కోట్లు ఇవ్వాలని కోరాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్రంలోని బ్యూరోక్రాట్స్ పరిశీలించడం గమనార్హం.
సాధారణంగా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు నిధుల కొరత ఉంటే, లోన్ కింద ప్రభుత్వాలు నిధులను సమకూర్చుకోవాలి. తద్విరుద్ధంగా ఓవర్ డ్రాప్ట్ ను కోరవడంపై కేంద్రంలోని పెద్దలు ఆరా తీస్తున్నారు. కేంద్ర పథకాలను అమలు చేయడానికి రాష్ట్రం వాటాగా 40శాతం నిధులను సమీకరించుకోవాలి. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని వ్యవయాల విభాగం కొత్త నిబంధనలను తాజా తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రతి పథకానికి సంబంధించిన లావాదేవీలను ఒక నోడల్ ఏజెన్సీ కింద జాతీయ బ్యాంకుల్లో నిర్వహించాలి. తాజా నిబంధనలను దేశ వ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తోంది. నిధులు వినియోగం, పారదర్శకత కోసం ఇలాంటి నిబంధనలను కేంద్రం తీసుకొచ్చింది.
కేంద్రం తాజా నిబంధనల ప్రకారం కేంద్ర పథకాల నిధులను పక్కదోవ పట్టించడానికి లేకుండా ఉన్నాయి. ఉదాహరణకు ఒక పథకం నిధులను 25శాతం ఆర్థిక ఏడాది తొలి విడత విడుదల చేస్తుంది. దానికి సరిపడా నిధులను రాష్ట్రం వాటా చూపాలి. కేంద్రం, రాష్ట్రం వాటా మొత్తాన్ని నోడల్ ఏజెన్సీ అకౌంట్లో ఎప్పటికప్పుడు కేంద్రం పరిశీలిస్తుంది. నిధులను సక్రమంగా ఖర్చుచేసినట్టు నిర్థారించుకున్న తరువాత మాత్రమే రెండో విడత నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. తాజా నిబంధనల ప్రకారం ఏపీ వాటాను కేంద్రం పథకాలకు జత చేయాలేక నానా అగచాట్లు పడుతోంది. కేంద్ర పథకాలకు వాటాను జత చేయకపోవడం వలన ఇప్పటి వరకు 6వేల కోట్లు కేంద్రం వద్ద నిలచిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర పథకాల నిధులు విడుదల కోసం ఓవర్ డ్రాఫ్ట్ మాత్రం ప్రత్యామ్నాయం. కానీ, ఇప్పటికీ పరిమితికి మించిన ఓవర్ డ్రాప్ట్ ను ఏపీ ప్రభుత్వం తీసుకుంది.
ఇలాంటి ఇబ్బందులను నుంచి బయట పడడానికి చాలా తెలివిగా ఏపీ ప్రభుత్వం పదవీ విరమణ చేసిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్ ను ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా నియమించుకుంది. అయినప్పటికీ నిబంధనలను ఉల్లంఘించడానికి బ్యాంకు సిద్ధంగా లేదని అర్థం అవుతోంది. సో..ఇప్పుడు రెండు విధాలుగా ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కోవలసి వస్తోంది. బ్యాంకులు మాత్రం ఏపీ ప్రభుత్వానికి నిధులు ఇవ్వడానికి నిబంధనలను అంగీకరించడంలేదని తేల్చడంతో ఆర్థిక డొల్లతనం బయటపడింది.