criminal case : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊరట..క్రిమినల్ కేసు ఎత్తివేత!
పవన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ అదే నెల 20వ తేదీన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలిచ్చారు.
- By Latha Suma Published Date - 01:03 PM, Tue - 19 November 24

Deputy CM Pawan Kalyan : గుంటూరు ప్రత్యేక కోర్టులో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఊరట లభించింది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన వలంటీర్లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వలంటీర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో పవన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ అదే నెల 20వ తేదీన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలిచ్చారు.
ఇక ప్రభుత్వం నేరుగా ఆదేశించడంతో గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఫిర్యాదు చేయడంతో పవన్‌పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయించారు. గతంలో పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు చేసిన వాలంటీర్లను న్యాయమూర్తి ప్రశ్నించగా.. తమకు ఈ కేసుతో సంబంధం లేదని, ప్రభుత్వం దాఖలు చేసిన ఫిర్యాదులో తాము సంతకాలు కూడా చేయలేదని చెప్పారు. దీంతో ఈ క్రిమినల్ కేసును తొలగిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
ఇకపోతే..పవన్ కళ్యాణ్ గతంలో వలంటీర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. వలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారంటూ ఆరోపించరు. గత యేడాది జూలై 9వ తేదీన ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో వెళుతున్నారని, దండుపాళ్యెం బ్యాచ్ తరహాలో మారిపోయారంటూ ఆరోపించారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతల ఒత్తిడి మేరకు పలువురు వలంటీర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం మేరకు కేసు నమోదైంది.