Raghu Ramakrishna : రఘురామపై కేసు వెనక్కి..? సుప్రీంకోర్టులో ఫిర్యాదుదారు సంచలన నిర్ణయం..!
Raghu Ramakrishna : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై పెట్టిన కేసు కొనసాగింపుపై సుప్రీంకోర్టులో కీలక మలుపు తలెత్తింది.
- Author : Kavya Krishna
Date : 04-08-2025 - 9:12 IST
Published By : Hashtagu Telugu Desk
Raghu Ramakrishna : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై పెట్టిన కేసు కొనసాగింపుపై సుప్రీంకోర్టులో కీలక మలుపు తలెత్తింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్‌భాష ఇకపై కేసును కొనసాగించలేనని ధర్మాసనానికి స్పష్టం చేశాడు.
ఈ కేసు 2022 జూన్‌లో మొదలైంది. హైదరాబాద్ బౌల్డర్‌హిల్స్‌లోని రఘురామ నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఫరూక్‌భాషను సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. అనంతరం స్థానిక గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ ఘటనపై రఘురామ, ఆయన భద్రతా సిబ్బంది ఫిర్యాదు చేశారు. కానీ డ్యూటీలో ఉన్న తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ కానిస్టేబుల్ ఫరూక్‌భాష అదే స్టేషన్‌లో రఘురామ, ఆయన కుమారుడు భరత్, సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై కేసు నమోదు చేయించాడు.
గచ్చిబౌలి పోలీసులు ఫరూక్‌భాష ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో రఘురామ ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేశారు. కానీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
వై-కేటగిరి సీఆర్‌పీఎఫ్ భద్రత ఉన్న సమయంలో అనేక ఘటనలు జరిగాయని రఘురామ తరపు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు ధర్మాసనానికి వివరించారు. అనుమానాస్పద వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా, తిరుగుగా తమపైనే కేసు నమోదు చేశారని ఆయన వాదించారు.
ఈ క్రమంలో ఫరూక్‌భాష తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, తన క్లయింట్ ఇకపై ఈ కేసును కొనసాగించబోరని ధర్మాసనానికి తెలిపారు. ఈ విషయంపై అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.
Nara Lokesh : ఆదోని ప్రభుత్వ స్కూల్లో ‘నో అడ్మిషన్ల’ బోర్డు.. స్పందించిన లోకేష్