Posani Krishna Murali: పోసాని షాకింగ్ నిర్ణయం.. ఇక జీవితంలో రాజకీయాలపై మాట్లాడను..
పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం తీసుకొని, ఇకనుంచి జీవితంలో రాజకీయాలు గురించి మాట్లాడబోనని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
- By Kode Mohan Sai Published Date - 12:30 PM, Fri - 22 November 24

వైసీపీలో కీలకంగా వ్యవహరించిన పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజకీయాలకు గుడ్‌బై చెప్పి, ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. కానీ, వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత, పోసాని కృష్ణమురళి పై పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి.
“ఇక నుంచి నేను రాజకీయాలు మాట్లాడను. ఏ రాజకీయ పార్టీతో కూడా నాకు సంబంధం లేదు. వైసీపీనే కాదు, ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ నాకు సభ్యత్వం లేదు. ఇకపై ఏ పార్టీని పొగడను, విమర్శించను, లేదా ఏదైనా మాట్లాడను. నన్ను ఎవరూ ఏమనలేదు.. ఎవరి గురించి ఇక మాట్లాడను. ఓటర్‌లా మాత్రమే ప్రశ్నించాను, మంచి చేస్తే వాళ్లకి సపోర్ట్ చేశా. నా కుటుంబం, పిల్లల కోసం ఇప్పుడు నేను రాజకీయాలు వదిలేస్తున్నాను” అని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు.
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ నేత. నా కుటుంబం కోసం రాజకీయలను వదిలేస్తున్నాను. నేను తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమే పోసాని కృష్ణ మురళీ #PosaniKrishnaMurali #politics #goodbye #YSRCP #YSJaganMohanReddy #HashtagU pic.twitter.com/cps9jSwj6f
— Hashtag U (@HashtaguIn) November 22, 2024
పోసాని కృష్ణమురళి మీద ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. సెప్టెంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో, పోసాని చంద్రబాబుపై అసత్య ప్రచారం మరియు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వంశీ ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని, వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా మాట్లాడినందున పోసానిపై చర్యలు తీసుకోవాలని సీఐడీని కోరారు.
పోసాని కృష్ణమురళి గత కొన్ని ఏళ్లుగా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన చంద్రబాబును ప్రజలను మోసం చేసిన నాయకుడిగా అభివర్ణించారు. పోసాని ఎక్కడ మాట్లాడినా, ఎన్టీఆర్‌కు అన్యాయం చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పై కూడా పోసాని పలు సందర్భాల్లో సంచలన ఆరోపణలు చేశారు. 2019 మరియు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు మద్దతుగా పనిచేశారు. వైసీపీ ఓటమి తర్వాత అతను సైలెంట్ అయి, తాజాగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పే నిర్ణయం తీసుకున్నారు.