PM Modi – AP : అటు ఏపీ.. ఇటు తెలంగాణ.. ప్రధాని మోడీ వర్చువల్ ప్రారంభోత్సవాలివే
PM Modi - AP : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఐఐటీ, ఐసర్(IISER) సంస్థలు ఇవాళ సొంత భవనాల్లో కొలువుదీరాయి.
- By Pasha Published Date - 04:57 PM, Tue - 20 February 24

PM Modi – AP : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఐఐటీ, ఐసర్(IISER) సంస్థలు ఎట్టకేలకు ఇవాళ సొంత భవనాల్లో కొలువుదీరాయి. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన తిరుపతి ఐఐటీ, ఐసర్ ఇన్నాళ్లు అద్దె భవనాల్లో కొనసాగాయి. విశాఖపట్నంలో కేంద్ర సర్కారు ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)తో పాటు తిరుపతి ఐఐటీ, ఐసర్ క్యాంపస్‌లను ఇవాళ ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. కర్నూలు ట్రిపుల్ ఐటీని ఆయన జాతికి అంకితమిచ్చారు. 2017లో తెదేపా హయాంలో ఏపీలో జాతీయ విద్యా సంస్థల నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణలోనూ..
- తెలంగాణలోని నిజామాబాద్‌లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ సముదాయాన్ని ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు.
- ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చారు.
- పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు సైతం మోడీ శంకుస్థాపన చేశారు.
- 2008 ఆగస్టు 18న ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఆవరణలో ఐఐటీ హైదరాబాద్ ప్రారంభమైంది. శాశ్వత క్యాంపస్ ఏర్పాటు కోసం కంది గ్రామంలో 576 ఎకరాలు కేటాయించారు. క్యాంపస్ నిర్మాణాన్ని 2010లో ప్రారంభించారు. 2015 జూలైలో ఐఐటీ హైదరాబాద్‌ను ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి కందిలోని శాశ్వత క్యాంపస్‌లోకి మార్చారు. మొదటి దశ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం, జపాన్‌కు చెందిన జైకా కలిసి సుమారు రూ.1700 కోట్లు ఖర్చు చేశాయి.
Also Read : Good News : ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్.. రూ.లక్ష వరకు పన్ను నోటీసులు విత్‌డ్రా
తిరుపతి ఐఐటీ, ఐసర్
- తిరుపతి జిల్లా ఏర్పేడుకు సమీపంలో ఐఐటీ, శ్రీనివాసపురంలోని ఐసర్ భవనాలను పూర్తి చేశారు.
- శ్రీనివాసపురంలో 255 ఎకరాల విస్తీర్ణంలో ఐసర్ భవనాల నిర్మాణాలు చేపట్టారు.
- తొలుత తిరుపతికి సమీపంలో తాత్కాలిక తరగతి గదులు నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం రూ.2117 కోట్ల వ్యయంతో ఇక్కడ అత్యాధునికంగా భవనాలు నిర్మించారు.
- ఏర్పేడుకు సమీపంలోని నంది కొండలను ఆనుకుని సుమారు 578 ఎకరాల్లో ఈ భవన నిర్మాణాలను చేపట్టారు. ఇక్కడ 1550 మంది విద్యార్థులు ఉన్నారు.
శాశ్వత భవనంలోకి ఐఐఎం
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన కేంద్ర విద్యా సంస్థల్లో ఒకటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం.
- 2016 నుంచి ఐఐఎం విశాఖ కార్యకలాపాలను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు.
- ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో 241.50 ఎకరాల్ని కేటాయించి మొదటి దశ శాశ్వత భవనాలు పూర్తి చేశారు. మొదటి దశలో రూ.472.61 కోట్లతో పనులు పూర్తయ్యాయి.
- 1,500 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంటును నిర్మించారు. దీని ద్వారా సంవత్సరానికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది.
- హార్వర్డ్ విశ్వవిద్యాలయ నమూనాను ఆదర్శంగా తీసుకుని విద్యార్ధులు ‘యు’ ఆకారంలో కూర్చొనేలా తరగతి గదులు నిర్మించారు.