AP : పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో ఎదురుదెబ్బ..ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఆగస్టు 21న జరిగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు నేడు (శుక్రవారం) కీలక తీర్పు వెల్లడిస్తూ వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు.
- By Latha Suma Published Date - 01:19 PM, Fri - 29 August 25

AP : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేతల జంట హత్యకేసులో నిందితులుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు తమపై ఉన్న కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆగస్టు 21న జరిగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు నేడు (శుక్రవారం) కీలక తీర్పు వెల్లడిస్తూ వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు.
హత్య కేసులో నిందితులుగా పిన్నెల్లి సోదరులు
ఈ కేసు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల దారుణ హత్యకు సంబంధించినది. ఈ హత్య కేసులో మొత్తం ఏడుగురిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. ప్రధాన నిందితుడు జవిశెట్టి శ్రీను అలియాస్ బొబ్బిలిగా ఉండగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6) మరియు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి (ఏ7)గా కేసులో పేర్కొనబడ్డారు. ఈ హత్య కేసులో మృతుల బంధువు తోట ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు IPC సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. కేసులో కుట్ర, ప్రోద్బల అంశాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. నిందితులు ఓ రెస్టారెంట్‌లో సమావేశమై హత్యకు కుట్ర పన్నారని, పిన్నెల్లి సోదరులు ఈ హత్యలో పాల్గొన్న ఇతర నిందితులతో ఫోన్ సంభాషణలు జరిపారని పోలీసులు పేర్కొన్నారు. వీటికి సంబంధించి సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు హాజరుపరిచారు.
హైకోర్టులో ఏజీ వాదనలు
ఆగస్టు 21న జరిగిన విచారణలో, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో కీలక వాదనలు వినిపించారు. పిటిషనర్లు హత్యకు ముందు కీలక సమావేశాలు నిర్వహించారు. మొదటి నిందితుడికి సర్పంచ్ పదవికి మద్దతిస్తామని హామీ ఇచ్చారు. హత్య అనంతరం పిన్నెల్లి సోదరులు మిగతా నిందితులతో ఫోన్‌లో పలుమార్లు మాట్లాడారు. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన వ్యక్తులైన వీరిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలి. వీరికి బెయిల్ మంజూరు చేస్తే, దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కావున వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించాలి అని వాదించారు.
న్యాయస్థాన తీర్పు
ఇరు పక్షాల వాదనలు పూర్తైన నేపథ్యంలో, న్యాయమూర్తి తీర్పును రిజర్వులో ఉంచారు. చివరికి శుక్రవారం వెలువరించిన తీర్పులో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసులో దర్యాప్తు మరింత వేగంగా సాగనుంది.
రాజకీయంగా ప్రాధాన్యం
ఈ తీర్పు వైసీపీ శిబిరంలో కలకలం రేపగా టీడీపీ వర్గాలు దీన్ని న్యాయం గెలిచిన ఘటనగా భావిస్తున్నాయి. మాచర్ల ప్రాంతంలో ఇప్పటికే రాజకీయ వేడి నెలకొన్న నేపథ్యంలో, ఈ తీర్పు స్థానిక రాజకీయం మీదనూ కేసు దిశ మీదనూ కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో పిన్నెల్లి సోదరులు అరెస్ట్ అయ్యే అవకాశాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకోవడంతో రాజకీయంగా కీలక మలుపు తిరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.