Pink Tiolets In Rajamahendravaram : మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు…వసతులు చూస్తే షాకే!
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నగరంలో మహిళల కోసం గులాబీ రంగు టాయిలెట్లను ఏర్పాటు చేసింది. అందులో వసతులు చూస్తే మిరే షాక్ అవుతారు..
- By Kode Mohan Sai Published Date - 03:18 PM, Mon - 10 March 25

Pink Tiolets In Rajamahendravaram : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నగరంలోని గులాబీ రంగు టాయిలెట్లను ఏర్పాటు చేసింది. వాటిని పరిశీలిస్తే, అవి విశ్రాంతి మందిరాలుగా చెప్పవచ్చు. ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించిన ఈ విశ్రాంతి కేంద్రాలను మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రారంభించారు. చారిత్రక మరియు ఆధ్యాత్మిక నగరమైన రాజమహేంద్రవరంలోని గోదావరి తీరానికి భక్తులు స్నానాలు చేసేందుకు వస్తుంటారు. వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ‘స్వచ్ఛ నగరం’ లక్ష్యంతో రూ. 10 లక్షలతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రారంభంగా, ఈ టాయిలెట్లు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో భాగంగా ఈ సౌకర్యాలను అందించారు.

Pink Tiolet
స్నానాలు చేసేందుకు అవసరమైన వసతులు, చిన్న పిల్లల తల్లుల కోసం ప్రత్యేక గదులు, పిల్లలను నిద్రపుచ్చేందుకు ఊయలలు, నాప్కిన్ యంత్రం వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే విశ్రాంతి తీసుకునే సౌకర్యాలు కూడా ఉన్నాయి. గులాబీ రంగు టాయిలెట్లను త్వరలో మరిన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో, గోదావరి తీరాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నామని, అందులో భాగంగా ఈ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు.