Supreme Court : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్
Tirupati Laddu Row : తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
- By Latha Suma Published Date - 04:34 PM, Sun - 22 September 24

Tirupati Laddu Row : గత వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో తిరుమ శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ఉపయోగించారనే వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. భక్తులకు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో తయారుచేసిన లడ్డూ ప్రసాదాన్ని అందించారని హిందూ సేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. హిందూ మతాన్ని అపహాస్యం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నాడు.
Read Also: TTD: లడ్డూ వివాదం..ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో “లడ్డూ ప్రసాదం” తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే ఆరోపణ హిందూ సమాజం యొక్క మనస్సాక్షిని కదిలించిందని, సభ్యుల మతపరమైన భావాలు, మనోభావాలను ఆగ్రహానికి గురి చేసిందని పిటిషన్ పేర్కొంది. ఈ కేసు ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉందని పిటిషనర్ పేర్కొన్నారు.
కాగా, లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఒక్కసారి హిందువులు, భక్తుల్లో ఆందోళన మొదలైంది. ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఏపీలో అధికార, విపక్షాల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఘటనపై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక కోరింది. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ కూడా దీనిపై స్పందించారు. చర్యలు తీసుకోవాలని కోరారు.