AP News: ఏపీ ప్రజలు సంతోషంగా ఉండాలంటే టీడీపీకి అధికారం ఇవ్వాలి : నారా భువనేశ్వరి
- By Balu J Published Date - 08:21 PM, Thu - 15 February 24
AP News: వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. గురువారం నాడు ‘‘నిజం గెలవాలి’’ యాత్ర సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మడకశిర సెంటర్‌లో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు. మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలం, దిన్నెహట్టి గ్రామంలో పార్టీ కార్యకర్త జి. ముత్తప్ప కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.
ముత్తప్ప కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.బాధిత కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ…వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓట్ల జాబితాలో అవకతవకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు.
టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఓట్లను వైసీపీ నేతలు తొలగిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో ఓటే మన ఆయుధమని చెప్పారు. ఈ ఐదేళ్లలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని.. కనీసం మౌలిక వసతులు కూడా అందడం లేదని అన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలని చెప్పారు.