Pawan Kalyan: సీఎం జగన్ దాడిపై పవన్ కళ్యాణ్ రియాక్షన్.. ఏమన్నారంటే
- Author : Balu J
Date : 15-04-2024 - 7:28 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan Kalyan: ఏపీ సీఎం జగన్ దాడిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి… చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలూ కట్టలేదు… చెట్లూ కొట్టలేదు’’ అని రియాక్ట్ అయ్యారు.
‘‘ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించీ విచారణ చేయించాలి. వాళ్ళు తీసుకున్న భద్రత చర్యల్లో లోపాలు ఏమిటి? ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటనేది తేలాలి. ముందుగా సదరు అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులక రాయి విసిరిన చేయి… ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుంది. సూత్రధారులు, పాత్రధారులెవరో తేలుతుంది’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
‘‘ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడే సెక్యూరిటీపరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఇలాంటి అధికారులు ఉంటే- గౌరవ ప్రధానమంత్రి గారు మరోసారి పర్యటించినప్పుడూ ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు? ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలి’’ పవన్ అన్నారు.