Pawan Kalyan: పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మీ భవిష్యత్ కోసం నన్ను నమ్మండి..!
రాజధాని పేరిట ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు మోసం చేస్తున్నారని జనసేనాని పవన్‌కల్యాణ్ అన్నారు.
- Author : Gopichand
Date : 13-11-2022 - 3:29 IST
Published By : Hashtagu Telugu Desk
రాజధాని పేరిట ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు మోసం చేస్తున్నారని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించిన పవన్ జగనన్న కాలనీని పరిశీలించి, ప్రసంగించారు. ‘‘ఉత్తరాంధ్ర ప్రజలకు బలమైన రాజకీయ అధికారం దక్కాలి. జనసేనకు ఒక్క అవకాశమిస్తే మార్పు చూపిస్తాం. మీ భవిష్యత్ కోసం నన్ను నమ్మండి. నాపై నమ్మకం ఉంచితే గూండాలతో పోరాడేందుకు సిద్ధం’’ అని పవన్ అన్నారు.
యువత తన శక్తిని అవినీతి నిర్మూలనకు వినియోగించాలని జనసేనాని పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ..‘‘అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దాం. అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. ఉత్తరాంధ్ర జనసైనికులు ధైర్యంగా పోరాడండి. బలంగా ఎదుర్కోండి. కేసులు పెడితే మీతో పాటు నేనూ వస్తా. అవినీతి కోటల్ని బద్దలు కొడదాం’’ అని పవన్ అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంతకముందు విజయనగరం జిల్లా గుంకలాం చేరుకున్నారు. ‘జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా గుంకలాంలో జగనన్న కాలనీని పవన్ పరిశీలించారు. విశాఖ నుంచి విజయనగరం వెళ్లే మార్గంలో పవన్‌కు జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆనందపురం కూడలి వద్ద భారీ గజమాలతో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా సింహాచలం భూముల సమస్యను పరిష్కారానికి చొరవ చూపాలంటూ పలువురు నేతలు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు.