Janasena Formation Day : 11 ఏళ్ల జనసేన వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసింది – పవన్
Janasena Formation Day : గత 11 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్నానని, ఈసారి ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకు పరిమితం చేయగలిగామని అన్నారు
- By Sudheer Published Date - 10:13 PM, Fri - 14 March 25

జనసేన ఆవిర్భావ దినోత్సవ (Janasena Formation Day) సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భావోద్వేగంగా మాట్లాడారు. తన చిన్న తనం వయసు నుండి నేటి పొలిటికల్ లీడర్ గా ఎదిగిన ప్రతిదాని గురించి చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ ఏర్పాటుకు తనలోని భావతీవ్రతే కారణమని, ప్రజా సమస్యలపై పోరాడే తత్వమే తనను ముందుకు నడిపిందని అన్నారు. ‘చంటి’ సినిమాలో మీనాలా తనను ఇంట్లో చాలా జాగ్రత్తగా పెంచారని, తన తండ్రి ఎప్పుడూ తన భవిష్యత్తు గురించి ఆలోచించేవారని పవన్ వెల్లడించారు. తన తండ్రి ఎస్ఐ అవ్వాలని కోరుకున్నప్పటికీ, తన విద్యాభ్యాసం పూర్తికాలేదని, అయితే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయడం భగవంతుడి రాతేనని అన్నారు.
సెకండ్ షో కథనంతో అందరినీ నవ్వించిన పవన్
తన చిన్నతనంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తుచేసుకుంటూ, ఒకసారి సెకండ్ షో సినిమా చూడడానికి వెళ్లి వచ్చిన తర్వాత తండ్రి చేతిలో తిట్లు తిన్నానని చెప్పి సభలో నవ్వులు పూయించారు. అప్పట్లో తన తండ్రి కోపంగా తిట్టినా, తాను హీరోగా ఎదిగి, వరుస హిట్ సినిమాలు ఇచ్చిన తరువాత కూడా తన తండ్రి తనపై ఆగ్రహం చూపించేవారని చెప్పారు. తన అన్నయ్యలపై మరింత కఠినంగా ఉండేవారని చెప్పి, కుటుంబపట్ల తండ్రి చూపిన క్రమశిక్షణను వివరించారు.
జనసేన విజయాలను గర్వంగా వివరించిన పవన్
పవన్ కళ్యాణ్ జనసేన గురించి మాట్లాడుతూ, గత 11 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్నానని, ఈసారి ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకు పరిమితం చేయగలిగామని అన్నారు. కేంద్ర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు తన రాజకీయ దృక్పథాన్ని ప్రభావితం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ తనను రాజకీయాల్లోకి రావాలని ప్రేరేపించారని, ఆయన ఇచ్చిన ఉత్సాహమే తనను రాజకీయ పోరాటంలో నిలబెట్టిందని అన్నారు. ఈ సందర్భంగా స్టేజీపైనే శ్రీపతి రాముడును సత్కరించి తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు.
శారీరకంగా బలహీనమైనా, ప్రజల ప్రేమతో ముందుకు వెళ్తాను
ప్రస్తుతం తాను శారీరకంగా బలహీనంగా మారానని అన్నారు. తమ్ముడు సినిమా సమయంలో గుండెలపై పరాళ్లు పగులగొట్టించుకునేంత బలంగా ఉన్న తాను, ఇప్పుడు తన ఆరేళ్ల కొడుకుని కూడా ఎత్తుకోలేకపోతున్నానని తెలిపారు. కానీ జనసేన కార్యకర్తల ప్రేమ, ప్రజల ఆశీస్సులతో తిరిగి శక్తిని సంపాదిస్తానని, ఇంకా ఎక్కువగా ప్రజాసేవ చేయగలనని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహభరితంగా నినాదాలు చేస్తూ పవన్‌కు మద్దతుగా నిలిచారు.