Pawan Kalyan: పవన్ కే చంద్రబాబు ప్రయారిటీ.. కారణమిదే
- Author : Balu J
Date : 14-06-2024 - 9:18 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan Kalyan: కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు… మంత్రివర్గ శాఖల పరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. అందరూ అంచనా వేసినట్లే ఉపముఖ్యమంత్రి హోదాతో పాటు… పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కట్టబెట్టారు. కూటమి ఏర్పడినప్పటి నుంచి పవన్ కు అన్నిరకాలుగా ప్రాధాన్యం ఇస్తున్న చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలోనూ అదే గౌరవం చూపించారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నేరుగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరీ చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత N.D.A శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా కూడా తనకు ప్రత్యేక సీటు ఏర్పాటుచేయడాన్ని తప్పుబట్టిన చంద్రబాబు.. పవన్ కు, తనకూ ఒకే తరహా కుర్చీ ఉండాలని స్పష్టంచేశారు.
ఆ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు… పవన్ కల్యాణ్ కు పూర్తిస్థాయిలో గౌరవమిస్తామని, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ప్రమాణ స్వీకారోత్సవంలోనూ పవన్ పట్ల ప్రత్యేక అభిమానం చూపించారు. ఇప్పుడు శాఖల కేటాయింపులోనూ అంతే ప్రాధాన్యం ఇవ్వడం పట్ల… జనసేన నేతలు, జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.