Pawan Kalyan : అన్యాయం, అరాచకాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తారా…!!!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర సందర్భంగా వర్చూరులో రచ్చబండసభలో పాల్గొన్నారు జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్.
- By hashtagu Published Date - 11:15 PM, Sun - 19 June 22

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర సందర్భంగా వర్చూరులో రచ్చబండసభలో పాల్గొన్నారు జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఈ సందర్బంగా జనసేనాని వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అధికార మదంతో కొట్టుకుంటున్నారని…తాను అన్యాయంపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. అన్యాయం జరుగుతుంటే..చూస్తూ ఎలా ఊరుకుంటామన్నారు. వైసీపీ నేతలు ఎవరినైనా..ఏమైనా అనొచ్చు కానీ..ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదా అని నిలదీశారు పవన్. ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిని మానసికంగా వేధిస్తున్నారని మండిపడ్డారు.
అధికార పార్టీ అరాచకాలపై ప్రశ్నిస్తే దత్తపుత్రుడు అంటున్నారని పవన్ ఆరోపించారు. తాను ఎవరికీ దత్తపుత్రుడిని కాదని…కేవలం ప్రజలకే దత్తపుత్రుడిని అని ఉద్ఘాటించారు. జగన్ మాత్రం కచ్చితంగా సీబీఐకి దత్తపుత్రుడేనని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో జగన్ సిబిఐ కేసులు ఎదుర్కొక తప్పదని పవన్ స్పష్టం చేశారు. కాగా పర్చూరు సభలో 80మంది కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున అందజేశారు. కన్నీళ్లు తుడవడానికి డబ్బు కంటే గుండె ఉంటే చాలన్నారు. మూడేండ్లలో 3వేల మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్.