Vamsi’s Right Hand : వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు అరెస్ట్
Vamsi's Right Hand : వంశీ నమ్మకస్తుడి(Vamsi's Right Hand)గా పేరున్న రంగా, అతని తరపున అన్ని కీలక వ్యవహారాలు చక్కబెట్టేవారని సమాచారం
- Author : Sudheer
Date : 26-03-2025 - 1:19 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓలుపల్లి మోహన్ రంగా (Olupalli Mohan Ranga)ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీ నమ్మకస్తుడి(Vamsi’s Right Hand)గా పేరున్న రంగా, అతని తరపున అన్ని కీలక వ్యవహారాలు చక్కబెట్టేవారని సమాచారం. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయనను రాజమండ్రిలో గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని సీఐడీ అధికారులకు అప్పగించారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో, చివరకు అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో “భూ భారతి”పై వాడీవేడి చర్చ
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వీడియో ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలతో పాటు, సత్యవర్ధన్ కిడ్నాప్ ఘటనలోనూ రంగా కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. గన్నవరంలో అక్రమాలకు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన, ఇటీవలే రాజమండ్రిలో తలదాచుకుని ఉన్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాలకు పారిపోకుండా ముందుగానే అతనిపై నిఘా పెట్టిన పోలీసులు, సరైన సమయం చూసుకుని అరెస్ట్ చేశారు. వంశీకి అత్యంత విశ్వసనీయంగా ఉన్న రంగా, పార్టీ కార్యకలాపాల్లోనూ ప్రభావం చూపే వ్యక్తిగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ కూడా బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో, ఆయన పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని భావిస్తున్నారు. ఇప్పుడు ఓలుపల్లి రంగా అరెస్టుతో మరిన్ని కీలక విషయాలు బయటకు రావచ్చన్న ఉద్దేశ్యంతో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ పరిణామాలు టీడీపీ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.