Anna Canteen : అన్న క్యాంటీన్‌లో కొత్త రూల్..!
Anna Canteen : ఒంగోలులోని కొత్తపట్నం రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్‌కు ఎక్కువగా కూలీలు భోజనం చేయడానికి వస్తున్నారు
- By Sudheer Published Date - 01:00 PM, Tue - 28 January 25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను(Anna Canteen) విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రధాన నగరాలు, పట్టణాలు, పంచాయతీల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లలో ప్రతిరోజూ వేలాది మంది రూ.5కే రుచికరమైన టిఫిన్, భోజనాన్ని పొందుతున్నారు. అయితే ప్రకాశం జిల్లా ఒంగోలులోని అన్న క్యాంటీన్‌లో ఒక సమస్య తలెత్తింది, దానిని పరిష్కరించేందుకు సిబ్బంది ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. ఒంగోలులోని కొత్తపట్నం రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్‌కు ఎక్కువగా కూలీలు భోజనం చేయడానికి వస్తున్నారు. అయితే, వీరిలో కొందరు మద్యం తాగి వచ్చి సిబ్బందితో గొడవకు దిగుతుండటంతో సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో క్యాంటీన్ సిబ్బంది ‘మందు తాగి వచ్చేవారికి టోకెన్ ఇవ్వబడదు’ అంటూ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంపై అంత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Deputy Cm Bhatti: ‘నాగోబా జాతర’ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి
ఇక రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 63 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్యాంటీన్ల ద్వారా రోజుకు 50,000 మందికి మూడు పూటలా ఆహారం అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఈ నెలాఖరులో కొత్త క్యాంటీన్ల స్థానాలపై స్పష్టత రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ప్రధానంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. కానీ, ఆ తర్వాత ఐదేళ్లలో ఈ క్యాంటీన్లు మూతపడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సేవను తిరిగి ప్రారంభించింది. 2024 ఆగస్టు 15న 199 క్యాంటీన్లను ప్రారంభించి పేదలకు సాయం చేస్తోంది.