Aruna Arrest : నెల్లూరు రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్టు
Aruna Arrest : నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతంలో రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నేరాలకు శ్రీకాంత్ సహకారం అందిస్తోందన్న అనుమానాలు, ఆమెపై వరుసగా నమోదైన ఫిర్యాదుల నేపథ్యంలో కోవూరు పోలీసులు అరుణను అదుపులోకి తీసుకుని ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు.
- By Kavya Krishna Published Date - 11:21 AM, Wed - 20 August 25

Aruna Arrest : నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతంలో రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నేరాలకు శ్రీకాంత్ సహకారం అందిస్తోందన్న అనుమానాలు, ఆమెపై వరుసగా నమోదైన ఫిర్యాదుల నేపథ్యంలో కోవూరు పోలీసులు అరుణను అదుపులోకి తీసుకుని ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు. నాలుగు రోజుల క్రితం ఒక సీఐకి ఫోన్ చేసి తాను హోంశాఖ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ బెదిరించిందన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా తన ఇంటిని అద్దెకు తీసుకున్నా డబ్బులు చెల్లించకుండా, తిరిగి ఆ ఇంటిని లాక్కోవడానికి ప్రయత్నించిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఉద్యోగం ఇప్పిస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిందన్న ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి.
ఈ ఆరోపణలపై అరుణ తన వాదనను వినిపిస్తూ తాను ఏ తప్పూ చేయలేదని, తప్పుడు కేసుల్లో తనను ఇరికిస్తున్నారని చెబుతోంది. కొందరు కానిస్టేబుళ్లు తన కారులో గంజాయి పెట్టి మోసపూరితంగా కేసు పెట్టాలని ప్రయత్నించారని ఆరోపించింది. అయితే ఆమెపై వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పోలీసులు, నిఘా విభాగం తీవ్రంగా పరిశీలిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో అరుణ, శ్రీకాంత్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ కావడంతో సంచలనం రేగింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, ఇద్దరూ కలిసి సరసాలు ఆడుకుంటూ ఉన్న దృశ్యాలు బయటకు రావడంతో పోలీసులకే అవమానం కలిగింది. ఈ వీడియోలపై కూడా ప్రత్యేక దర్యాప్తు జరుగుతోందని సమాచారం.
Bomb threats : ఢిల్లీలో 50కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు
శ్రీకాంత్ నేర చరిత్రను పరిశీలిస్తే, గూడూరుకు చెందిన అతను ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. 2010లో నెల్లూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించడం ప్రారంభించిన అతను, 2014 ఫిబ్రవరిలో జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు. దాదాపు నాలుగేళ్ల పాటు పోలీసులకు దొరకకుండా తిరిగిన అతను, 2018 నవంబరులో మళ్లీ పట్టుబడి అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు. కానీ జైలులో ఉంటూనే తన గ్యాంగ్‌ను బయట నుంచి నడిపించేందుకు అరుణను ఉపయోగించుకుంటున్నాడన్న ఆరోపణలు వెలువడుతున్నాయి.
ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో అరుణకు కొందరు ఉన్నతాధికారుల మద్దతు ఉందన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. జైలులో ఖైదీగా ఉన్న శ్రీకాంత్‌ను ఆస్పత్రిలో కలిసేందుకు సులభంగా అవకాశం దొరకడం, ఇద్దరూ సన్నిహితంగా గడిపే స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడం వెనుక కొంతమంది అధికారుల సహకారం లేకుండా సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కేసు చుట్టూ తలెత్తిన అనుమానాలన్నింటిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
Airtel : జియో బాటలో ఎయిర్‌టెల్..ఇక పై ఆ ప్లాన్స్ మరచిపోవాల్సిందే !!