LG Electronics In AP: శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌కు నారాలోకేష్ శంకుస్థాపన
ఏపీలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక మైలురాయిని చేరుకుంది. తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో ఎల్‌జీ గృహోపకరణాల తయారీ యూనిట్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.
- By Kode Mohan Sai Published Date - 11:43 AM, Wed - 7 May 25

LG Electronics In AP: రాయలసీమ అభివృద్ధికి మరో పెద్ద అడుగు పడుతోంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 8 వ తారీఖున తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్‌కు భూమిపూజ చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ అయిన ఎల్జీ, వచ్చే ఆరేళ్లలో రూ.5,001 కోట్ల వ్యయంతో ఈ యూనిట్‌ను పలు దశలలో ఏర్పాటు చేయనుంది.
2024 సెప్టెంబర్‌లో జపాన్ నుంచి వచ్చిన ఎల్జీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చే లక్ష్యం, వేగవంతమైన వ్యాపార నిర్వహణకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఫలితంగా, ఎల్జీ ఈ రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది.
ఈ యూనిట్‌లో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు తదితర గృహోపకరణాలు తయారవుతాయి. అంతేకాకుండా, వీటి తయారీకి అవసరమైన భాగాలైన కంప్రెసర్లు, మోటార్ కంప్రెసర్లు, హీట్ ఎక్స్‌ఛేంజర్లు కూడా ఎపిలోనే ఉత్పత్తి చేయనుంది. రాబోయే ఆరేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రెండు వేల ఉద్యోగాలు కల్పించనున్నారు. అదనంగా, రూ.839 కోట్లతో ఐదు అనుబంధ యూనిట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.
యువతకు ఉద్యోగాలు కల్పించడం మంత్రి లోకేష్ ప్రధాన లక్ష్యంగా తీసుకున్నారు. యువగళం పాదయాత్రలో వలస సమస్యను ప్రత్యక్షంగా చూశిన ఆయన, అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు 20 లక్షల ఉద్యోగాల ప్రణాళికకు రూపకల్పన చేశారు. ఈ దిశగా మొదటి రోజు నుంచే ఆయన పని ప్రారంభించారు.
కేవలం ఐదు నెలల్లోనే ఎల్జీ యూనిట్‌కి అవసరమైన అనుమతులు, ప్రోత్సాహకాలను పూర్తిచేసి ప్రాజెక్టు ప్రారంభానికి మార్గం సుగమం చేశారు. పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి తెచ్చేందుకు లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారు. గత 11 నెలల్లో రూ.8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు, 5 లక్షల ఉద్యోగాలకుగాను ఎంఓయూలు కుదిరేలా చేశారు.
ఆర్సెలర్ మిట్టల్, బీపీసీఎల్, టీసీఎస్, ఎన్టీపీసీ, టాటా పవర్, రిలయన్స్ సీబీజీ వంటి ప్రముఖ సంస్థలు లోకేష్ చొరవతో ఏపీలో భారీగా పెట్టుబడులకు ముందుకొచ్చాయి. హిందూజా గ్రూప్ అశోక్ లేలాండ్ యూనిట్ మల్లవల్లిలో ప్రారంభమైంది. అలాగే, ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కి ఇటీవల భూమిపూజ జరిగింది. రూ.65వేల కోట్ల విలువైన 500 గ్రీన్ ఎనర్జీ యూనిట్లను రాష్ట్రంలో రిలయన్స్ ఏర్పాటు చేయనుంది.
విదేశాల్లో, ముఖ్యంగా అమెరికా, దావోస్ పర్యటనలలో వందలాది పారిశ్రామికవేత్తలను కలిసిన మంత్రి లోకేష్, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని వివరించి, రాష్ట్రానికి ఆహ్వానించారు. అభివృద్ధికి ఇది మరో మైలురాయిగా నిలవనుంది.