Murder Case : పిన్నెల్లి సోదరులపై మర్డర్ కేసు
Murder Case : హత్య కేసులోనూ ఆయనను ఏ-6, ఆయన సోదరుడిని ఏ-7 నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.
- By Sudheer Published Date - 09:21 PM, Sun - 25 May 25

పల్నాడు జిల్లాలోని మాచర్ల(Macharla)లో ఘోర హత్య చోటుచేసుకుంది. ఈ ఘటనలో టీడీపీకి చెందిన ఇద్దరు క్షేత్రస్థాయి నాయకులు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. వారిని స్కార్పియో కారుతో ఢీ కొట్టి దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆధిపత్య రాజకీయాల నేపథ్యంలో జరిగిన ఈ హత్యతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు, హత్యకు సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి(Pinnelli Brothers)లపై IPC సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేశారు.
పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం.. గత ఎన్నికలకు ముందు శ్రీను, వెంకట్రావుల అనే ఇద్దరు నాయకులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరు పిన్నెల్లి సోదరులకు సమీపంగా ఉన్న వ్యక్తులుగా గుర్తింపు పొందారు. మరోవైపు మాచర్లలో టీడీపీ కార్యకలాపాలను స్వయంగా వెంకటేశ్వర్లు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆధిపత్య పోరులో శ్రీను, వెంకట్రావులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇదే సందర్భంలో పన్ను పగ పెంచుకుని, పిన్నెల్లి సోదరుల సహకారంతో హత్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సమయంలో ఓటర్లను బెదిరించడం, పోలింగ్ బూత్‌లోకి అక్రమంగా ప్రవేశించి ఈవీఎంలను ధ్వంసం చేయడం వంటి కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు హత్య కేసులోనూ ఆయనను ఏ-6, ఆయన సోదరుడిని ఏ-7 నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ పరిణామాలతో పిన్నెల్లి కుటుంబానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడనున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హత్యకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మరిన్ని వివరాలను త్వరలో వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.