MLA Quota MLCs: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. రేసులో కీలక నేతలు
టీడీపీ ఎమ్మెల్సీలు(MLA Quota MLCs) జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియబోతోంది.
- By Pasha Published Date - 07:53 AM, Sat - 1 March 25

MLA Quota MLCs: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు కాబోయేది ఎవరు ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో ఐదుగురిని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయనున్నారు. ఈ స్థానాల్లో నాలుగు టీడీపీకి, ఒకటి జనసేనకు దక్కనున్నాయి. జనసేన వైపు నుంచి నాగబాబుకు ఎమ్మెల్సీ బెర్తు ఖాయమని తెలుస్తోంది. అయితే జనసేనలోని ఇతర సీనియర్ నేతలను కాదని, తన సోదరుడికే ఈ పదవిని కట్టబెట్టేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయిపోవడంపై పెదవి విరుస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. మరోవైపు టీడీపీ మాత్రం నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో కీలక నేతలకు అవకాశం ఇవ్వబోతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ బలోపేతం లక్ష్యంగా ఈ ఎమ్మెల్సీ పదవులను కేటాయించేందుకు చంద్రబాబు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ కేటాయింపుల్లో కీలక సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.
Also Read :Virat Kohli: మరో సరికొత్త రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. కేవలం 52 పరుగులు చాలు!
యనమలకు మైనస్ పాయింట్
టీడీపీ ఎమ్మెల్సీలు(MLA Quota MLCs) జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియబోతోంది. అయితే ఈ నేతల్లో ఎవరికి టీడీపీ మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తుందనేది వేచి చూడాలి. కాకినాడ ఎకనామిక్ జోన్, సీపోర్ట్‌ల విషయంలో లేఖ రాయడం అనేది యనమలకు మైనస్ పాయింటుగా మారొచ్చని అంటున్నారు. నారా లోకేశ్‌తో ఆయనకు గ్యాప్ ఉందని చెబుతున్నారు. మొత్తం మీద ఈసారి ఆయనకు ఎమ్మెల్సీ బెర్త్ దక్కకపోతే, రాజ్యసభకు పంపే ఛాన్స్ ఉందట.
ఎస్వీఎస్‌ఎన్ వర్మ త్యాగానికి గుర్తింపు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం తన సిట్టింగ్ స్థానాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ వదులుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో వర్మ చేసిన త్యాగానికి గుర్తింపు లభించబోతోంది. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారట.
Also Read :Skype: 22 ఏళ్ల స్కైప్ సేవలకు గుడ్ బై చెప్పనున్న మైక్రోసాఫ్ట్!
పరిశీలనలో ఇతర నేతలు..
అర్హత ఉన్నప్పటికీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు వల్ల సీటు దక్కించుకోలేకపోయిన ముఖ్య నేతలకు ఎమ్మెల్సీలుగా టీడీపీ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఈ లిస్టులో మాజీమంత్రులు జవహర్, దేవినేని ఉమా, వంగవీటి రాధ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, నల్లపాటి రాము, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్థన్, బుద్ధా వెంకన్న, అంగర రామ్మోహన్‌లు కూడా ఈ పోటీలో ఉన్నారట.