Gudivada Casino Issue : కేసినో గొడవ..ఏ కంచికి చేరుతుందో..
ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యల కంటే రాజకీయ పరమైన తదాగాలే ఎక్కువవుతున్నాయి.
- By Hashtag U Published Date - 11:46 AM, Sat - 22 January 22

ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యల కంటే రాజకీయ పరమైన తదాగాలే ఎక్కువవుతున్నాయి. తాజాగా కొడాలి నాని గుడివాడలో నిర్వహిస్తున్న కె కన్వెన్షన్ సెంటర్ లో గోవా తరహా కేసినోలు నిర్వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిజ నిర్థారణ చేయడం కోసం ఆరుగురు తెలుగుదేశం నాయకులు గుడివాడ వెళ్ళారు. ఆరుగురు వెళ్ళానికే పోలీసులు అనుమతించారు. కాని గుడివాడలో పార్టీ ఆఫీస్ కు చేరుకున్న టీడీపీ నేతలు, అక్కడి నుంచి కార్యకర్తలను వెంటేసుకుని కొడాలి కన్వెన్షన్ సెంటర్ కు వెళ్ళేందుకు ప్రయత్నించారు. వైసీపీ వాళ్ళు దాడి చేయడం, బోండా ఉమ కారు అద్దాలు పగలడం, టీడీపీ నేతల్ని అరెస్ట్ చేసి వదిలేయడం అన్నీ ప్రజలందరికీ తెలిసినవే.
ఎక్కడైనా అధికార పార్టీ నాయకులకు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. అది ఏ పార్టీ అయినా పోలీసులు వారి మాటే వింటారు. ప్రతిపక్షం మాట అసలు వినరు. దశాబ్దాలుగా మన దేశంలో అధికార పార్టీలు అలా అలవాటు చేశాయి. పైగా ప్రతిపక్షం వెళ్ళి నిజనిర్థారణ చేస్తామంటే అధికార పార్టీ నేత, మంత్రి, టీడీపీ సంగతి తెలిసినవాడు సహిస్తాడా. నిజంగా అక్కడ కేసినో నిర్వహించి ఉంటే ఇన్ని రోజుల తర్వాత టీడీపీ నేతలు వెళ్ళి ఏం చేస్తారు. ఏమి నిరూపిస్తారు. ఒక వేళ అక్కడ కేసినో జరగకపోయినా జరిగినట్లు ప్రచారం చేస్తే. ప్రతిపక్షం అనేది అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకే ప్రయత్నిస్తుందనేది జగమంతా తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నిజంగా కేసినో నిర్వహించారా లేదా అనే విషయాన్ని తేల్చడానికి ఇండిపెండెంట్ కమిటీని నియమిస్తే కొంతలో కొంత నిజాలు బయటకు వచ్చే వీలుంటుంది. సహజంగా అధికార పార్టీ నేతలపై ప్రభుత్వం జరిపే విచారణలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. టీడీపీ రాజకీయం చేయడానికే గుడివాడ వెళ్ళి హడావుడి చేసినట్లు అర్థమవుతోంది.
ఇక కొడాలి నాని విషయానికి వస్తే ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో గుడివాడ ప్రజలందరికీ తెలుసు. మంత్రయ్యాక ఆయన ఉపయోగించే భాష ఎలా ఉంటున్నదో ప్రజలంతా గమనిస్తున్నారు. ఇప్పుడు కమ్మ సామాజికవర్గమంతా గుడివాడలో కొడాలి నాని వెనుకే ఉన్నారు. ఆయన వల్ల లబ్ది పొందుతున్నారు. గుడివాడలో కొడాలి నాని చెప్పిందే చట్టం. అందువల్ల అక్కడకు తెలుగుదేశం నాయకులు వెళ్ళి చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. అయినా వెళ్ళారు. అయితే ఇక్కడ కొడాలి నాని నోటి నుంచే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. తాను హైదరాబాద్ లో కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమయంలో తన కన్వెన్షన్ సెంటర్ లో డ్యాన్సులు వేస్తున్నట్లు సమాచారం వస్తే జిల్లా ఎస్ పీకి ఫోన్ చేసి దాని సంగతేంటో తేల్చమని స్వయంగా చెప్పినట్లు తెలిపారు. తన కన్వెన్షన్ సెంటర్ లో కేసినో నిర్వహించినట్లు రుజువు చేస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటానని కూడా కొడాలి నాని సవాల్ విసిరారు. ఒకవేళ నిజంగా నిర్వహించినా అధికారంలో ఉన్నారు గనుక బయటకు రాదనే ధీమా కావచ్చు. సంక్రాంతి పండుగ నాడు రాష్ట్రమంతా కోడి పందేలు, పేకాట జరిగినట్లే గుడివాడలో కూడా జరిగినట్లు మంత్రి ప్రకటించారు. కోడి పందేలను హైకోర్టు నిషేధించింది. అయినా ఏపీలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కోడిపందేలు జరిగాయని, వందల కోట్ల పందేలు కాసారని మీడియా అంతా కోడై కూసింది. మంత్రి కూడా అదే మాట చెప్పారు. మరి ఏపీలో హైకోర్టు ఆదేశాలు అమలవుతున్నాయా లేదా అనే మిలియన్ డాలర్ల ప్రశ్న వేసుకోవాల్సి ఉంది.
చివరిగా తెలుగుదేశం నాయకలు గుడివాడలో ఓ మాట చెప్పారు. కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ లో కేసినో నిర్వహించినట్లు తమ దగ్గరున్న వీడియో ఆధారాలను పోలీసులకు ఇచ్చామని, వెంటనే మంత్రిపై చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళతామని హెచ్చరించారు. చెప్పినట్లుగానే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్ళడం ఖాయం. మరి కొడాలి నాని పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ముఖ్యమంత్రి జగన్ కాపాడినా, కోర్టు ఊరుకుంటుందా?