Red Alert : ఏపీ తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్.. మిచౌంగ్ తుఫాను తీరాన్ని దాటేది ఎప్పుడంటే ?
Red Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో ఏపీలోని పలు తీర ప్రాంత జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
- Author : Pasha
Date : 04-12-2023 - 10:41 IST
Published By : Hashtagu Telugu Desk
Red Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో ఏపీలోని పలు తీర ప్రాంత జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలెర్ట్ ప్రకటించింది. పశ్చిమ గోదావరి, ఉత్తర కోస్తా, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, బాపట్ల, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలోని తీర ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాయలసీమ ప్రాంతంలోని తిరుపతి, చిత్తూరు, అన్నమ్మయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలు కూడా తుఫానుతో ప్రభావితమవుతాయని పేర్కొంది. మిచౌంగ్ తుఫాను వాయవ్య దిశగా కదులుతోందని, ఇది రేపు (మంగళవారం) తీవ్ర తుఫానుగా మారొచ్చని తెలిపింది. నెల్లూరుకు ఆగ్నేయంగా 420 కి.మీ, బాపట్లకు ఆగ్నేయంగా 530 కి.మీ, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న మిచౌంగ్ తుఫాను డిసెంబర్ 5న(మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
We’re now on WhatsApp. Click to Join.
తుఫాను ప్రభావం పడే అవకాశమున్న జిల్లాలలో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఅర్ఎఫ్ బృందాలను మోహరించారు. తుఫాను నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తుఫాను ముప్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పౌరుల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మిచౌంగ్ తుఫాను ఎఫెక్టుతో విజయనగరం, విశాఖ, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి, కాకినాడ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. ఒక మత్స్యకారుడు(Red Alert) గల్లంతయ్యాడు.