Chandrababu P4 Policy : పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్న లక్ష్యమే ‘P4 ‘
Chandrababu : “పీ4 విధానం ఒక విప్లవాత్మక చర్య, ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. గతంలో జన్మభూమి కార్యక్రమం లాంటి ప్రజా స్పందనను ఇది కూడా పొందుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
- By Sudheer Published Date - 12:03 PM, Fri - 13 June 25

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) “P4” పేరుతో కొత్త అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు, అన్ని రంగాల్లో సమతుల్య ప్రగతిని సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులోని “P4” అనే పదం నాలుగు ముఖ్యమైన అంశాలకు సంకేతంగా నిలుస్తుంది. People, Public, Private, Partnership. అంటే ప్రజలు, పబ్లిక్ (ప్రభుత్వ), ప్రైవేట్ (వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు) మరియు పార్టనర్‌షిప్ (అంటే వాటి మధ్య సహకారంపై ఆధారపడి అభివృద్ధి చేయడం).
పీ4 విధానం ప్రధాన ఉద్దేశం :-
పీ4 విధానం యొక్క ప్రధాన ఉద్దేశం.. సమాజంలో ఆర్థికంగా బలమైన 10% ఉన్నత వర్గాలు, అట్టడుగు 20% పేద కుటుంబాలకు చేయూతనివ్వడం. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను ‘బంగారు కుటుంబం’గా, సహాయం అందించే వారిని ‘మార్గదర్శి’లుగా పిలుస్తారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందించదు, కానీ దాతలు, లబ్ధిదారులను కలిపే వేదికగా పనిచేస్తుంది. ఈ విధానం పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుందనీ, ఎవరినీ బలవంతం చేయరని సీఎం స్పష్టం చేశారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నాయని ప్రభుత్వం అంచనా వేసింది.
P4 లక్ష్యాలు మరియు ప్రయోజనాలు :-
ఈ కార్యక్రమం ద్వారా పలు రంగాల్లో అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, వ్యవసాయం, పారిశ్రామికీకరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య భాగస్వామ్యంతో ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించబడ్డాయి. P4 మోడల్ ద్వారా పల్లె-పట్నం మధ్య వృద్ధి వ్యత్యాసాన్ని తగ్గించడమే కాక, ప్రతి గ్రామాన్ని స్మార్ట్ గ్రామంగా అభివృద్ధి చేయడం లక్ష్యం. అంతేకాక, ఈ మోడల్ ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు, మహిళల సాధికారత, వ్యవసాయ ఉత్పాదకత పెంపు వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు.
రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే P4 దృక్పథం : –
P4 మోడల్ అమలుతో ప్రజల అవసరాలు, ప్రభుత్వ విధానాలు, ప్రైవేట్ పెట్టుబడులు, నిపుణుల సహకారం అన్నీ కలిసొచ్చేలా చేసి సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు చంద్రబాబు దృష్టి పెట్టారు. గతంలోనూ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న అనుభవాన్ని ఈ కార్యక్రమంలో సమర్థవంతంగా వినియోగించేందుకు యోచిస్తున్నారు. గ్రామ స్థాయిలో డిజిటల్ కనెక్టివిటీ, సుళువైన సేవలు, వ్యవసాయ విలువ జోడింపు కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ఈ కార్యక్రమం దృష్టి పెట్టనుంది. దీంతో రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరిగి, ఒక కొత్త వృద్ధి దశకు నాంది పలకనుంది.
లబ్దిదారుల ఎంపిక ఎలా ?
ఈ కార్యక్రమం అమలు కోసం, గ్రామ సభలు, వార్డు సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గృహ సర్వేలు నిర్వహించి, నిజమైన పేద కుటుంబాలను గుర్తించే పని పూర్తయింది. ఈ వివరాలను ‘సమృద్ధి బంధనం’ (Samruddhi Bandhanam platform) అనే ఆన్‌లైన్ వేదికలో అప్‌లోడ్ చేస్తారు, దీని ద్వారా దాతలు తాము సహాయం చేయాలనుకునే కుటుంబాలను ఎంచుకోవచ్చు. ఈ సహాయం విద్యా ఖర్చులు, వైద్య ఖర్చులు, ఆస్తులు లేదా గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి రూపంలో ఉండవచ్చు.
పేదరిక నిర్మూలనే లక్ష్యం : –
ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించి, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించాలని భావిస్తోంది. “పీ4 విధానం ఒక విప్లవాత్మక చర్య, ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. గతంలో జన్మభూమి కార్యక్రమం లాంటి ప్రజా స్పందనను ఇది కూడా పొందుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.