Jonnagiri Gold Mine: మార్కెట్లోకి ‘మేడిన్ జొన్నగిరి’ బంగారం
- Author : Vamsi Chowdary Korata
Date : 27-06-2026 - 11:04 IST
Published By : Hashtagu Telugu Desk
మేడిన్ ఆంధ్ర బంగారం అందుబాటులోకి వచ్చింది. కర్నూలు తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్‌మైన్స్ నుంచి గోల్డ్ మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. జియో మైసూర్ సంస్థ తయారుచేసిన 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్లు షాపుల్లో కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌తో పాటుగా జొన్నగిరి గోల్డ్‌మైన్స్ పేరుతో ముద్ర వేశారు. ప్రస్తుతం కర్నూలులోని షరాబ్ బజారుకు చెందిన కొందరు వ్యాపారుల దగ్గర ఈ బిస్కెట్లు ఉన్నాయి. అలాగే బంగారం స్వచ్ఛత తెలిసేలా 999 నంబర్ కూడా ముద్ర వేశారు. ఇందులో 24 క్యారెట్ల స్వచ్ఛత ఉందంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం ఈ 500 గ్రాముల బిస్కెట్ విలువ సుమారు రూ.75 లక్షలకు పైనే ఉంటుందంటున్నారు.
జొన్నగిరి గోల్డ్‌మైన్స్ నుంచి ప్రస్తుతానికి 100 కిలోలు మాత్రమే ఉత్పత్తి చేసి విక్రయించినట్లు కర్నూలు బంగారం వ్యాపారులు చెబుతున్నారు. చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని, కానీ ప్రస్తుతం మార్కెట్‌లోకి పరిమితంగానే అందుబాటులోకి వచ్చిందంటున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో వినియోగదారుల కోసం మార్కెట్‌లోకి విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జియో మైసూరు-జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అదే రోజు జొన్నగిరి గోల్డ్ మైన్స్‌లో ఉత్పత్తి చేసిన బంగారాన్ని కర్నూలుకు చెందిన బంగారం వ్యాపారులు కామిశెట్టి జగదీష్, చక్రవర్తి, శ్రీహరిమూర్తితో పాటుగా పలువురు కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆ బంగారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఒక వ్యాపారి ఒక గోల్డ్ బిస్కెట్‌ను వినియోగదారులకు అమ్మేసినట్లు చెప్పారు.
కర్నూలు జిల్లా జొన్నగిరి గని నుంచి బంగారం ఉత్పత్తి చేయడంతో విదేశీ దిగుమతులు తగ్గుతాయని, మన విదేశీ మారకద్రవ్యం దేశం దాటి పోదని చెబుతున్నారు. అలాగే ప్రస్తుతానికి ప్రభుత్వం ఎలాంటి పన్ను రాయితీలు ఇవ్వలేదని, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి ఏ పన్నులు వర్తిస్తాయో జొన్నగిరి బంగారానికి కూడా వర్తిస్తాయంటున్నారు. ప్రస్తుతం అన్ని రకాల పన్నులు, జీఎస్టీతో కలిపి బిస్కెట్లు విక్రయిస్తున్నారు. కర్నూలులో జ్యువెలరీ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. ఒకవేళ అక్కడ క్లస్టర్ ఏర్పాటైతే వేలాది మంది స్థానిక స్వర్ణకారులకు, కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. దీనివల్ల స్థానికంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. మొత్తం మీద కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్‌మైన్స్ నుంచి బంగారం ఉత్పత్తి మొదలవ్వడంతో, త్వరలోనే మేడిన్ ఆంధ్ర బంగారం పూర్తిస్థాయిలో వినియోగదారులకు మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.