Liquor Shops : సెప్టెంబరు 7న ప్రభుత్వ మద్యం షాపులు బంద్.. కారణం ఇదే
ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం త్వరలో నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురానుంది.
- By Pasha Published Date - 11:25 AM, Sat - 31 August 24

Liquor Shops : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణాలు సెప్టెంబరు 7న బంద్ కానున్నాయి. ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం త్వరలో నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురానుంది. ఆ పాలసీ ద్వారా తమకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనతో సెప్టెంబరు 7న ఒక్కరోజు షాపులను మూసివేయాలని ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగులు నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ బేవరేజెస్ ఉద్యోగుల సంఘం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన తమను ఉద్యోగాల నుంచి తొలగించొద్దని వారు కోరుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటుపరం చేయకూడదని ఏపీ బేవరేజెస్ ఉద్యోగుల సంఘం కోరుతోంది. దీనిపై ప్రభుత్వం నుంచి తమకు క్లారిటీ రాకపోతే.. సెప్టెంబరు 4 నుంచి ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. అవసరమైతే సెప్టెంబరు 7న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను(Liquor Shops) బంద్ చేస్తామని చెప్పారు.
Also Read :Hydra : గగన్‌పహాడ్‌లో హైడ్రా టీమ్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా తమను నియమించిందని, కానీ తమకు కనీస వేతనం సమయానికి ఇవ్వలేదని ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగులు అంటున్నారు.తమకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఓటీలు కూడా చేతికి అందలేదని పేర్కొన్నారు. గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు తాము కూడా మద్దతు తెలియజేశామని తెలిపారు. ఇప్పుడు ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తమను ఆదుకోవాలని, 18 వేల కుటుంబాలను రోడ్డున పడేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.