HPCL : పెట్రోలియం కంపెనీపై పిడుగు.. భారీగా చెలరేగిన మంటలు
ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించేందుకు శ్రమించాయి. మంటలు ఒక్కసారిగా భారీ ఎత్తున ఎగిసి పడటంతో, పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
- By Latha Suma Published Date - 04:52 PM, Sun - 7 September 25

HPCL : హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లో శనివారం మధ్యాహ్నం తీవ్ర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెట్రోలియం ట్యాంక్‌పై పిడుగు పడటంతో, భారీ మంటలు ఎగిసి పడాయి. భారీ శబ్దంతో ప్రారంభమైన ఈ ప్రమాదం కంపెనీలో ఆందోళనకర పరిస్థితిని సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం ఉద్యోగులను సురక్షితంగా బయటకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించేందుకు శ్రమించాయి. మంటలు ఒక్కసారిగా భారీ ఎత్తున ఎగిసి పడటంతో, పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Read Also: Urea Shortage : ప్రభుత్వ అవినీతి వల్లే యూరియా కొరత – బొత్స
పొగలు దట్టంగా వ్యాపించడంతో కొంత మంది ఊపిరితిత్తుల సమస్యలకు గురయ్యారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించారు. ఆమె వెంటనే అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె మంటలు ప్రస్తుతం పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఎవరూ గాయపడకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు అని తెలిపారు. అయితే మంటలు ఎలా వ్యాపించాయనే కోణంలో అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన పిడుగుపాటు గురించి వాతావరణ శాఖ నివేదికను కూడా పరిశీలిస్తున్నారు. కార్మికులంతా సురక్షితంగా బయటకు వచ్చారని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు ప్రజల హృదయాలను కలిచివేస్తున్నాయి.
ప్రస్తుతానికి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, భయపడాల్సిన అవసరం లేదని హోం మంత్రి అనిత ప్రజలకు భరోసా ఇచ్చారు. సంఘటనా స్థలంలో పోలీసు, అగ్నిమాపక శాఖ, HPCL అధికారుల సమన్వయంతో పర్యవేక్షణ కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఈ ఘటన మరోసారి పరిశ్రమల భద్రతాపరమైన అంశాలపై ప్రశ్నలు లేవనెత్తింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల స్పందన వేగంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
Read Also: Japan : జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా ప్రకటన