Lagadapati Survey : ఏపీ అక్టోపస్ మళ్లీ `ప్లాష్`
ఏపీ అక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయ తెరపైకి రాబోతున్నారా? రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ ఢిల్లీ వైపు చూస్తున్నారా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మళ్లీ క్రీయాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నారని అర్థం అవుతోంది.
- By CS Rao Published Date - 01:05 PM, Mon - 25 April 22

ఏపీ అక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయ తెరపైకి రాబోతున్నారా? రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ ఢిల్లీ వైపు చూస్తున్నారా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మళ్లీ క్రీయాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నారని అర్థం అవుతోంది. సమైఖ్యాంధ్ర కోసం పోరాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ తీరుపై విరక్తి చెంది రాజకీయాలకు దూరంగా జరిగారు. వ్యాపారాలు, కుటుంబ వ్యవహారాలకు మాత్రమే 2014 నుంచి పరిమితం అయ్యారు. కానీ, సర్వేల రూపంలో ఆయన గేమ్ ను 2019 ఎన్నికల్లో చూశాం. ఈసారి కూడా అలాంటి గేమ్ లోకి వస్తూనే, రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రావాలని ఆయన సన్నిహితుల ఉవాచ.
సర్వేల్లో ఆరితేరిన లగడపాటి రాజగోపాల్ కు ఏపీ ఆక్టోపస్ అని పేరు. 2018 ఎన్నికల వరకు ఆయన చేసిన సర్వేలన్నీ చాలా వరకు నిజం అయ్యాయి. అందుకే, ఆయన సర్వేల ఆధారంగా పెద్ద ఎత్తున బెట్టింగ్ లు కాచుకునే వారు అనేకులు. జూదానికి ఆయన సర్వేలు బాగా ఉపయోగ పడ్డాయి. వాటి ఆధారంగా కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్లు ఉన్నారు. ఆయన సర్వేలను నమ్ముకుని ఆస్తులను అమ్ముకుని దివాళా తీసిన వాళ్లు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితి ఒక దశాబ్దం పాటు నడిచింది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల గురించి కూడా `ప్లాష్ టీం` తో సర్వేలు చేయించడం ఆయన ప్రవృత్తి. తొలి రోజుల్లో ఆయన సన్నిహితుల వరకు మాత్రమే ఆ సర్వేల రిపోర్టులు ఉండేవి. ఆ తరువాత బెట్టింగ్‌ల రూపంలో విస్తృతి పెరిగింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని సర్వేను బయటపెట్టాడు. అంతేకాదు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలవబోతున్నారని ఫలితాలకు ముందుగా సర్వేల నివేదికను బయట పెట్టారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు హిట్ కాబోతుందని ఆనాడు బాకా ఊదారు. ఫలితంగా వేల కోట్ల రూపాయాల బెట్టింగ్ ఆ ఎన్నికల్లో నడిచింది. తీరా, ఫలితాలు వచ్చిన తరువాత ఆయన సర్వేకు భిన్నంగా టీఆర్ఎస్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయన్ను నమ్ముకున్న వాళ్లు దివాళా తీశారు. ఆయన సర్వేలపై తొలిసారిగా నమ్మకం పోయింది. వాస్తవంగా 2014, 2017 ప్రాంతాల్లో జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్లాష్ టీం చేసిన సర్వేలు నిజం అయ్యాయి. అంతేకాదు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సర్వే నిజం రూపం దాల్చింది. ఆ నమ్మకంతో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వేల కోట్ల బెట్టింగ్ జరిగింది.
ఏడాది వ్యవధిలోనే జరిగిన 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఏపీ జోస్యం చెప్పారు. దేశ వ్యాప్తంగా యూపీఏ అధికారంలోకి వస్తుందని ప్లాష్ టీం అంచనా వేసింది. తెలుగుదేశం పార్టీకి 120 ప్లస్ ఎమ్మెల్యేలను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. అంతేకాదు, చంద్రబాబునాయుడు పంచిన పసుపు, కుంకుమ గెలిపించబోతుందని శాస్త్రీయంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బెట్టింగ్ కు దిగి చేతులు కాల్చుకున్న వాళ్లు ఏపీ 2019 ఎన్నికల్లో వేల కోట్లు పందెం కాశారు. లగడపాటి సామాజికవర్గానికి చెందిన ఒక న్యూస్ ఛానల్ తో చంద్రబాబు మళ్లీ సీఎం కాబోతున్నాడని బాకా ఊదించారు. దీంతో భారీగా ఆయన సామాజికవర్గంలోని కుబేరులు పెద్ద ఎత్తున బెట్టింగ్ లు కట్టారు. సీన్ కట్ చేస్తే, 151 మంది ఎమ్మెల్యేలను వైసీపీ గెలుచుకుంది. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అయ్యారు. ఆ ఎన్నికల్లో లగడపాటి చేసిన సర్వేకు భిన్నంగా ఫలితాలు రావడంతో సర్వేలకు దూరంగా ఉంటానని రాజగోపాల్ మీడియా ముఖంగా ప్రకటించారు.
మూడేళ్ల తరువాత మళ్లీ సర్వేలు చేయడానికి ప్లాష్ టీంను సిద్ధం చేస్తున్నట్టు లగడపాటి మీద ప్రస్తుతం న్యూస్ వస్తోంది. అంతేకాదు, రాబోవు ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎంపీగా కేశినేని నాని విజయవాడ నుంచి ఉన్నప్పటికీ ఈసారి అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా లగడపాటిని దింపాలని ఆ పార్టీ భావిస్తుందట. తెలుగుదేశం పార్టీకి తెరవెనుక ప్లాష్ టీం పనిచేస్తుందని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు చంద్రబాబుకు సర్వేలను అందిచేస్తూ పార్టీకి అండదండగా ఉన్నారని సమాచారం. అందుకే, లగడపాటి ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఆయన సర్వేల్లోనూ గెలుపు ఖాయంగా కనిపిస్తుందని అంచనా వేశారట. మొత్తం మీద లగడపాటి మళ్లీ రంగంలోకి దిగబోతున్నారన్నమాట. ఈసారి బెట్టింగ్ రాయుళ్లు ఆయన సర్వేలను నమ్ముతారా? అనేది డాలర్ల ప్రశ్న.