Nara Lokesh: కడపలో తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన నారా లోకేశ్
Nara Lokesh: కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని సీకే దిన్నె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దేశంలోనే తొలిసారిగా పూర్తి సౌరశక్తి ఆధారిత సెంట్రలైజ్డ్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ కిచెన్ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.
- By Kavya Krishna Published Date - 04:07 PM, Tue - 2 September 25

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్న భోజన పథకానికి కొత్త దిశా నిర్దేశం లభించింది. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని సీకే దిన్నె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దేశంలోనే తొలిసారిగా పూర్తి సౌరశక్తి ఆధారిత సెంట్రలైజ్డ్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ కిచెన్ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక వంటశాల ద్వారా వేలాది మంది విద్యార్థులకు పరిశుభ్రంగా, రుచికరంగా, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించనున్నారు.
సీకే దిన్నె వంటశాల ప్రారంభోత్సవంతోపాటు కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో రెండేసి, కడప పట్టణంలో ఒకటి కలిపి మొత్తం ఐదు స్మార్ట్ కిచెన్‌లను లోకేశ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ కింద ఈ వంటశాలల ద్వారా 136 పాఠశాలలకు చెందిన 10,332 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 13 వాహనాల ద్వారా ఆహారం పాఠశాలలకు సరఫరా చేయబడుతుంది. వంటకు అవసరమైన నీటి కోసం ప్రత్యేక ఆర్వో ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో ఆహారం తయారవుతుందని, ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు సమయానికి సరఫరా చేస్తామని అధికారులు వివరించారు.
TG High Court : కేసీఆర్, హరీశ్ రావులకు ఊరట..కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్టు
ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను సమీక్షించిన మంత్రి లోకేశ్, “సీకే దిన్నె స్మార్ట్ కిచెన్ పనితీరును సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని మరింత మెరుగైన విధంగా తీర్చిదిద్దుతాం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కడప జిల్లాలోని 11 మండలాల్లో 33 స్మార్ట్ కిచెన్‌లను ఏర్పాటు చేసి 1.24 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తాం” అని తెలిపారు.
పాఠశాలను సందర్శించిన లోకేశ్, పదో తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. గత ఏడాది విద్యా సంస్కరణలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సెమిస్టర్ పాఠ్యపుస్తకాల వల్ల బరువు తగ్గిందని, సన్నబియ్యంతో అన్నం రుచిగా ఉందని విద్యార్థులు చెప్పారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, కొత్త బెంచీలు, ఎత్తైన కాంపౌండ్ వాల్ అవసరమని కోరగా వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్త యూనిఫాంలు, బ్యాగుల నాణ్యత బాగున్నప్పటికీ సైజు పెంచాలని సూచించగా ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
ఓ విద్యార్థిని గీసిన లోకేశ్ ముఖచిత్రాన్ని ఆయనకు అందించగా, మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. మరో విద్యార్థి గంగిరెడ్డి గణేశ్ రెడ్డి చేతిరాతను పరిశీలించిన లోకేశ్, అతని ప్రతిభను ప్రశంసించారు. “ఈసారి పరీక్ష మీకే కాదు, నాకూ ఉంది. మీరు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలి. మీ భవిష్యత్తే మా ప్రభుత్వ లక్ష్యం” అని విద్యార్థులను ఉత్సాహపరిచారు.
ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి నుంచి సూచనలు కోరిన లోకేశ్, ఉపాధ్యాయులు విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, పీటీఎం మినహా అదనపు పనులు అప్పగించబోమని స్పష్టం చేశారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యం కోసం వెంటనే ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సబిత, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, ఎమ్మెల్యేలు చైతన్య రెడ్డి, మాధవీరెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్ పై లోకేశ్ సెటైర్