KA Paul : జనసేనానికి ‘ప్రజాశాంతిపార్టీ’ బంపరాఫర్
ఏపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళుతుందని టీడీపీ భావిస్తోంది. ఆ కోణం నుంచి మిగిలిన విపక్షాలను కూడా సిద్ధం చేస్తోంది.
- Author : CS Rao
Date : 04-03-2022 - 4:09 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళుతుందని టీడీపీ భావిస్తోంది. ఆ కోణం నుంచి మిగిలిన విపక్షాలను కూడా సిద్ధం చేస్తోంది. అందుకే, చిన్నాచితకా పార్టీలు కూడా ఇప్పుడు ఏపీ ముందస్తు ఎన్నికల వైపు ఆలోచిస్తున్నాయి. అమెరికాలో ఉన్న ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కూడా ముందస్తు ప్రచారాన్ని అందుకున్నాడు. రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చాడు.అందరూ అంగీకరిస్తే, తాను ప్రధాన మంత్రి అవుతానని కేసీఆర్ తరహాలో జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టాడు. అంతేకాదు, ఏపీ సీఎం పదవి కావాలంటే..ప్రజాశాంతి పార్టీలో చేరాలని పవన్ కు సోషల్ మీడియా వేదికగా ఆహ్వానం పలికాడు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తోన్న పాల్ త్వరలోనే ఏపీ ఎన్నికల సీజన్లోకి అడుగు పెట్టనున్నాడు. ఆ మేరకు ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ లోపుగా ప్రజాశాంతి పార్టీలోకి పవన్ ను తీసుకోవాలని పార్టీ క్యాడర్ కు కూడా సంకేతాలు పంపాడట.
2019 ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ప్రచారాన్ని ఏపీ ఓటర్లు అలరించారు. కానీ, ఓట్లు మాత్రం వేయలేదు. దీంతో ప్రధాన విపక్ష పార్టీల చీఫ్ లు హైదరాబాద్ కు మకాం మార్చినట్టు పాల్ అమెరికాకు వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు ఏపీ సమస్యలపై అమెరికా నుంచి జూమ్ ద్వారా రియాక్ట్ అవుతున్నాడు. ప్రజా శాంతి పార్టీ క్యాడర్ కు అమెరికా నుంచి దిశానిర్దేశం చేస్తున్నాడు. తాజాగా ఆ పార్టీ సభ్యత్వం కోసం వినూత్న ఆఫర్ ను కూడా ప్రకటించాడు. సభ్యత్వ సంఖ్య ఆధారంగా పదవులను ఇస్తామని పాల్ వెల్లడించాడు.
Hey @PawanKalyan sirrrr, ,please listen to the would be P M of INDIA. pic.twitter.com/TzUnFpZDJZ
— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2022
2019 ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆంధ్రాను అమెరికా చేస్తానని పాల్ ఇచ్చిన స్లోగన్ ను బ్యూటిఫుల్ గా ప్రజలు విన్నారు. ఏడు లక్షల కోట్లు ప్రపంచ దేశాల నుంచి విరాళాల రూపంలో తీసుకొస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. జీతం తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చాడు. నర్సాపురం లోక్ సభకు నామినేషన్ వేసే సమయంలో ఆనాడు జనసేన అభ్యర్థి నాగబాబుతో సంప్రదింపులు జరిపాడు. నామినేషన్ విత్ డ్రా చేసుకుని మద్ధతు ఇవ్వాలని కోరినట్టు చెప్పాడు. లేదంటే జనసేన , ప్రజాశాంతి పార్టీ పొత్తు పెట్టుకుందామని ఆఫర్ ఇచ్చాడు.జనసేనాని పవన్ ఆయన సోదరుడు నాగబాబులను సొంత కుటుంబ సభ్యులుగా పాల్ భావించాడు. సామాజిక కార్డ్ ను కూడా జనసేనపై పాల్ ఆనాడు ప్రయోగించాడు. కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించడానికి పాల్ ఆ ఎన్నికల్లో ప్రయత్నం చేశాడు. జనసేన, బీఎస్పీ, వామపక్షాలతో కలిసి పవన్ 2019 ఎన్నికలకు వెళ్లాడు. ఆ కూటమి కంటే ఎక్కువగా ఓట్లు వస్తాయని ప్రతి వేదికపైన పాల్ సవాల్ చేశాడు. నామినేషన్ల సమయంలోనూ పాల్ మార్క్ ఆనాడు కనిపించింది. వివిధ రంగాలు, వర్గాలకు చెందిన వాళ్లకు నామినేషన్ పత్రాలను అందించాడు. కానీ, ఆ పత్రాలపై పాల్ సంతకాలను కొందరు ఫోర్జరీ చేశారు. ఆ మేరకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశాడు. ఆయన పెట్టిన ప్రజాశాంతి పార్టీ మత ప్రాతిపదికన జగన్ ఓట్లను చీల్చుకుంటుందని చాలా మంది భావించారు. పైగా జగన్ ఫ్యాన్, పాల్ హెలికాప్టర్ రెక్కలు ఒకేలా ఉండడంతో వైసీపీ ఆందోళన చెందింది. ఇలా..ఆ ఎన్నికల్లో సామాజిక వర్గం రూపంలో జనసేనను, మత ప్రాతిపదికన వైసీపీని పాల్ వెంటాడు. ఇప్పుడు మళ్లీ `పవన్ ఫ్యాన్స్ అందరికీ చెపుతున్నా.. పవన్ సీఎం కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా.. ఆయనను ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలిపించుకుందాం. మీరంతా ఓకే అంటే నేను ప్రధానిగా ఉంటా. పవన్ ను కావాలంటే ముఖ్యమంత్రిని చేద్దాం’ అంటూ ఓ వీడియోను పాల్ విడుదల చేశాడు. ఆ వీడియోను సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేయడం పొలిటికల్ వర్గాల్లో కామిడీ టాపిక్ గా మారింది.