Janasena TDP Alliance : భస్మాసుర హస్తం
నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు జనసేన పార్టీ అండ కావాలని కోరుకుంటున్నారు. పొత్తు గురించి ప్రస్తావిస్తూ `వన్ సైడ్ లవ్` అంటూ ఆయన చేసిన వ్యాఖ్య పవన్ రాజకీయ సామర్థ్యాన్ని ఆకాశానికి తీసుకెళ్లింది.
- By CS Rao Published Date - 03:38 PM, Wed - 6 April 22

నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు జనసేన పార్టీ అండ కావాలని కోరుకుంటున్నారు. పొత్తు గురించి ప్రస్తావిస్తూ `వన్ సైడ్ లవ్` అంటూ ఆయన చేసిన వ్యాఖ్య పవన్ రాజకీయ సామర్థ్యాన్ని ఆకాశానికి తీసుకెళ్లింది. ఎలాంటి సిద్ధాంతం లేకుండా ప్రశ్నించడానికంటూ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని పవన్ ప్రకటించారు. ఆయన మినహా ఆ పార్టీకి అప్పట్లో ఎవరూ లేరు. కానీ, 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పార్టీతో పొత్తు అంటూ మోడీ, చంద్రబాబు సభల్లో కనపించారు. అమాంతం ఆ పార్టీ క్రేజ్ ను పెంచేసుకున్నారు. ఏపీకి జరిగిన 2014 ఎన్నికల్లో చంద్రబాబును సీఎంను చేశామంటూ చెప్పుకునే వరకు ఆ పార్టీ ప్రతిష్టను పెంచేసుకున్నారు.ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కంటే పవన్ కు ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకుని పరిపాలన అంశాలపై చర్చించిన సందర్భాలు లేకపోలేదు. ఖాళీగా ఉన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ లేదా సమావేశం నిర్వహించి ఏదైనా అంశాన్ని పవన్ లేవనెత్తగానే ఉరుకులుపరుగుల మీద చంద్రబాబునాయుడు ఆప్పట్లో స్పందించారు. క్యాంప్ ఆఫీస్ కు వచ్చినప్పుడు ఎదురేగి ఆహ్వానించడం, తిరిగి కారుదాకా వచ్చి వీడ్కోలు చెప్పడం గమనించాం. ఆ రాచమర్యాదలు పైసా ఖర్చు కించిత్ శ్రమ లేకుండా పవన్ ను ఏపీ పాలిటిక్స్ లో ఒక పవర్ గా నిలిపాయడాన్ని కాదనలేం. ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎవరికీ ఇవ్వని ప్రాధాన్యం పవన్ కు ఇచ్చారని ఎవరైనా చెప్పగలరు.
అమరావతి రాజధాని, పోలవరం, ఎస్సీ వర్గీకరణ, కాపు రిజర్వేషన్ తదితర అంశాలపై కాలానుగుణంగా పవన్ స్పందిస్తుంటారు. పార్టీ ప్రకటించిన తొలి రోజుల్లో చేగువీరా, చాకలి ఐలమ్మ భావజాలాన్ని వినిపించారు. వాటికి 2014 ఎన్నికల్లో చంద్రబాబు, మోడీ భావజాలన్ని జోడించారు. ఏపీలోని చంద్రబాబు పరిపాలనపై విభేదిస్తూ 2019 ఎన్నికల్లో చంద్రబాబు, మోడీ భావజాలాన్ని పక్కన పెట్టి, కాన్షీరాం భావజాలాన్ని అతికించారు. తొలిసారిగా జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో కమ్యూనిస్ట్ లు, బీఎస్పీతో కలిసి 65 స్థానాల్లో పోటీ చేసింది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ గెలిచారు. ఆయన కూడా ప్రస్తుతం వైసీపీ నీడన ఉంటున్నారు. ఆ ఎన్నికల్లో జనసేన కూటమికి సుమారు నాలుగు శాతం ఓటు వచ్చింది. అంటే, సుమారు రెండు శాతం జనసేన పార్టీకి వచ్చిన ఓటు బ్యాంక్ గా అప్పట్లో అంచనా వేసిన వాళ్లు అనేకులు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు కొనసాగిస్తోన్న ఆ పార్టీకి ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు ఎక్కడా రాలేదు.స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. ఆ సమయంలో జనసేన కొన్ని చోట్ల పోటీ చేసింది. తెలుగుదేశం క్యాడర్ వైసీపీకి నేరుగా వదిలిపెట్టడం కంటే అందుబాటులో ఉన్న జనసేన అభ్యర్థిని చాలా చోట్ల ఆదరించారు. ఫలితంగా ఆ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీలను కొన్ని చోట్ల గెలుచుకో గలిగింది. ఆ ఓటు బ్యాంకును అంచనా వేసుకుంటూ ప్రస్తుతం జనసేనకు 21 శాతం వరకు ఓటు బ్యాంకు ఉందని అంచనా వేస్తోంది. అదే విషయాన్ని జనసేన ఆవిర్భావ సభలోనూ, మంగళవారం జరిగిన మంగళగిరి పార్టీ ఆఫీస్ సమావేశంలోనూ పవన్ గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కేవలం రెండుశాతం ఓట్లు ఉన్న పార్టీకి చంద్రబాబునాయుడు ఇస్తున్న ప్రాధాన్యం ఆ పార్టీ క్రేజ్ ను పెంచేసింది. ప్రస్తుతం 23 ఎమ్మెల్యేలకు పరిమితం అయిన టీడీపీ 2019 ఎన్నికల్లో సుమారు 40.5శాతం ఓట్లను కలిగి ఉంది. అయినప్పటికీ జనసేన వెంట చంద్రబాబు పడ్డారు. ఫలితంగా ఏపీలోని రాజకీయాల్లో జనసేన ఒక ఐకాన్ గా ప్రస్తుతం కొందరికి కనిపిస్తోంది.
రాబోయే ఎన్నికల్లో పొత్తు లేకుండా గెలవలేమనే సంకేతాన్ని క్యాడర్ కు చంద్రబాబు ఇచ్చేశారు. దీంతో జనసేనాని రాజకీయాన్ని మరింత రక్తికట్టిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానంటూ ఆవిర్భావ సభ వేదికగా పవన్ ప్రకటించారు. అందుకోసం బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నానని వెల్లడించారు. ఆ రోజు నుంచి రాజకీయాల్లో ఆయన మాట మీద సీరియస్ చర్చ జరుగుతోంది. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. అంటే, చంద్రబాబుకు పల్లకీ మోస్తారా? అంటూ వైసీపీ విమర్శలకు పదును పెట్టింది. వాటికి క్లారిటీ ఇస్తూ మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో పవన్ క్లూ ఇచ్చేశారు. ఎవరికీ పల్లకీలు మోయడానికి లేమనే విషయాన్ని క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారు. అంటే, బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం సీఎం అభ్యర్థిగా పవన్ ఉంటారన్నమాట. జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మిగిలిన పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపు నిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు 2014 నుంచి ఇప్పటి వరకు జనసేనకు ఇస్తోన్న రాజకీయ ప్రాధాన్య ఫలితమేనని చెప్పక తప్పదు. దీంతో టీడీపీ ఆశిస్తోన్న అధికారానికి ఇప్పుడు పెద్ద సవాల్ అయింది. గత ఎన్నికల్లో 65 స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఈసారి కనీసం 150 చోట్ల పోటీకి సిద్ధం అవుతోంది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే, పురాణాల్లోని భస్మాసుర హస్తం కథనం చంద్రబాబుకు వర్తింప చేస్తే సరిపోతుందని అనకుండా ఉండలేం.