Janasena Sabha Heat in AP Politics : ఆవిర్భావ సభ హీట్
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కాకుండా ముందుగానే వైసీపీ అప్రమత్తం అయింది.
- By CS Rao Published Date - 02:37 PM, Mon - 14 March 22

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కాకుండా ముందుగానే వైసీపీ అప్రమత్తం అయింది. జనసేన సభకు తరలి వస్తోన్న జనాన్ని చూసి అప్పుడే విమర్శనాస్త్రాలను సిద్ధం చేసింది. ప్యాకేజి సైజ్ పెంచుకోవడానికే బలనిరూపణ అంటూ ఆవిర్భావ సభపై ఆరోపణలు మొదలు పెట్టింది. సభ ప్రారంభం కాకముందే ఇలాంటి ఆరోపణలను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందుకున్నాడు. ఆయనతో పాటు మరికొందరు జనసేన, పవన్ కల్యాణ్ పై వ్యక్తిగతంగా దాడి చేసేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే మంత్రి పేర్ని నాని తరచూ జనసేన పార్టీ ఆవిర్భావం గురించి ప్రస్తావిస్తూ వస్తున్నాడు. కిరాయి ఇవ్వడానికి రాజకీయ పార్టీని పవన్ పెట్టాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. కిరాయికి టెంట్ హౌస్ సామానులను ఇచ్చినట్టు ఇతర పార్టీలకు అద్దెకు జనసేన పార్టీని అప్పగిస్తున్న ఏకైక నాయకుడు పవన్ అంటూ మంత్రి పేర్ని చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. జనసేన హవాను అడ్డుకోవడానికి వైసీపీ మంత్రులు ఆరోపణాస్త్రాలను సిద్ధం చేసుకున్నారు.
ఆవిర్భావ సభకు కొన్ని కండీషన్ల మధ్య జగన్ సర్కార్ అనుమతులు ఇచ్చింది. గత వారం రోజులుగా ఆ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీగా తరలిరానున్న జనం కోసం ఏర్పాట్లను పగడ్బందీగా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ నాదెండ్ల మనోహర్ చేస్తున్నాడు. ప్రత్యేకించి వీర మహిళల కోసం సౌకర్యవంతమైన ఏర్పాట్లను చేశారు. గుంటూరు జిల్లాల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో జరిగే ఆవిర్భావ సభకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.ఇప్పటికే సభా ప్రాంగణం మధ్యాహ్నంకు నిండిపోయింది. ఆ ప్రాంతంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పరిస్థితులను జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు పరిశీలించారు. పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మంగళగిరి చేరుకున్నాడు. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన ఇప్పటంకు చేరుకుంటాడు. జనసేన ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తయి తొమ్మిదో ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో సభను సక్సెస్ చేయాలని ఆ పార్టీ ఏర్పాట్లను చేసింది. సభా ప్రాంగణం అంతా కటౌట్లతో నిండిపోయింది. సుమారు 100 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో సభా వేదిక నిర్మితమైంది.జనం సభా కార్యక్రమాలను చూసేందుకు వీలుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లను ఉంచారు. పార్టీ భవిష్యత్ ప్రణాళికను పవన్ కల్యాణ్ ఈ వేదికపై నుంచి. ప్రకటిస్తారని జనసైనికులు ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే, టీడీపీతో పొత్తుపై కూడా ఈ సభ ద్వారా సంకేతాలు రానున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలపై తమ వైఖరిని పవన్ కల్యాణ్ తెలపనున్నాడు. జనసేన పార్టీ విశాఖ సిటీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ మినహా అన్ని జిల్లాల్లోనూ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసుకుంది. దీంతో ఆవిర్భావ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వస్తోంది. కొందరు బస్సులు, కార్లలో నినాదాలు చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇలాంటి స్పందన గమనించిన నిఘా వర్గాలు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. అందుకే, సభ ప్రారంభం కాకుండానే ఎదురుదాడికి వైసీపీ దిగింది.
“ఐపీఎల్‌లో క్రీడాకారుల వేలంపాట జరుగుతుంది. అదే విధంగా పవన్ కల్యాణ్ కూడా సభలు పెట్టి ప్యాకేజీలు పెంచుకోవడానికే ప్రయత్నాలు చేస్తారు. ఆయన వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు. “ అంటూ మంత్రి వెల్లంపల్లి ఆరోపణలకు దిగాడు. “సభలు పెడితే ప్యాకేజీలు ఎక్కువగా వస్తాయనేది పవన్ ఉద్దేశమని, తనకు ఎంత ఎక్కువగా వస్తాయనే దానిపైన మాత్రమే పవన్ యత్నాలని“ మంత్రి ఎద్దేవా చేశారు. ”నాకింత మంది జనం ఉన్నారని నిరూపించుకోవడానికి ఇటువంటి సభలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఏమైనా ఉందా? ఎవరైనా ఆయనను నమ్ముతారా? పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి ఉదయం విమానంలో ఏపీకి వచ్చి సాయంత్రం తిరిగి వెళ్లిపోతారు. అటువంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారు? అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలకు దిగాడు.జనసేన ఆవిర్భావ సభ రోజే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశాడు. ఇటీవల జరిగిన కాపు నేతల సమావేశంలోనూ ఆయన పాల్గొన్నాడు. జనసేన ఆవిర్భావ సభలో ఇచ్చే దిశానిర్దేశం ఆధారంగా ఏపీలో కాపు నేతలు కొత్త పార్టీ వైపు వెళ్లాలా? లేక పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు మద్ధతు ఇవ్వాలా? అనే దానిపై ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అందుకే సభ ప్రారంభం కాకుండానే జనసేన పార్టీ మీద వైసీపీ రాజకీయ దాడికి దిగింది. ఫ్లెక్సీలు పెట్టుకునే క్రమంలోనూ వైసీపీ, జనసేన మధ్య వివాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా ఆ రెండు పార్టీల మధ్య ఆవిష్కరణ సభ చుట్టూ రాజకీయ రాద్ధాంతం నడుస్తోంది. సభ సూపర్ హిట్ అయితే వైసీపీ అదే స్థాయిలో ఎదురు దాడి చేసే ఛాన్స్ ఉంది. సో..రాబోవు రోజుల్లో వైసీపీ, పవన్ మధ్య రాజకీయ దాడికి జనసేన ఆవిర్భావ సభ అస్త్రంగా మారనుంది.