Janasena BJP : ఔను! వాళ్లిద్దరూ ఒకటయ్యారు ! బీజేపీకి బ్రేకప్ ?
ఏపీ రాజకీయ ముఖచిత్రం మారనుంది. ఆ విషయాన్ని జనసేనాని పవన్ కుండబద్దలు కొట్టి చెప్పారు.
- Author : CS Rao
Date : 18-10-2022 - 4:17 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ రాజకీయ ముఖచిత్రం మారనుంది. ఆ విషయాన్ని జనసేనాని పవన్ కుండబద్దలు కొట్టి చెప్పారు. అంతేకాదు, బీజేపీతో కలిసి పనిచేయలేకపోతున్నామని మంగళగిరి వేదికగా జరిగిన జనసేన సమావేశంలో వెల్లడించారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే విజయవాడ నోవాటెల్ హోటల్ లో ఉన్న పవన్ ను కలిసేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు వెళ్లారు. దీంతో టీడీపీ, జనసేన పొత్తు దాదాపుగా ఖరారు అయిందనే సంకేతాలు ఉన్నాయి.
విశాఖ పర్యటనకు వెళ్లిన పవన్ కు వైసీపీ గర్జన రూపంలో వ్యతిరేక ఏర్పడింది. ఆయన్ను హోటల్ ను ఖాళీ చేసి వెళ్లాలని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మరుసటి రోజు మంగళగరి జనసేన పార్టీ ఆఫీస్ కు చేరుకుని కార్యకర్తల మీటింగ్ పెట్టారు. ఆ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలపై బూతులు ప్రయోగించారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు గురించి ప్రస్తావించారు. రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూసినప్పటికీ క్లారిటీ రాలేదని అన్నారు. అందుకే, ఆ పార్టీతో కలిసి పనిచేయలేకపోతున్నానని వెల్లడించారు. దీంతో బీజేపీతో బ్రేకప్ అయిందని ప్రచారం జరుగుతోంది.
బీజేపీతో అలయెన్స్ ఉన్నప్పటికీ ఎక్కడో సరిగా లేదనే భావన కనపడుతోందన్నారు. ఆ విషయం తమకు తెలుసు, బీజేపీ నాయకత్వానికి కూడా తెలుసని పవన్ అన్నారు. రోడ్ మ్యాప్ అడిగింది బీజేపీతో కలిసి వెళ్లడానికేనని, అయితే వారు మ్యాప్ ఇవ్వక పోవడం వల్ల తనకు సమయం గడిచిపోతుందని చెప్పారు. తనకు పదవుల మీద వ్యామోహం లేదని, అయితే రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే, గూండాలు గదమాయిస్తుంటే ప్రజలను కాపాడుకోవడానికి వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుందని అన్నారు. ప్రధాని మోదీకి కానీ, బీజేపీకి కానీ తాను వ్యతిరేకం కాదని చెప్పారు. బీజేపీని ఎప్పుడూ గౌరవిస్తామని, అలాగని ఊడిగం చేయలేమని చెప్పారు. సరిగ్గా ఈ వ్యాఖ్యలు బీజేపీతో బ్రేకప్ చేసుకుని టీడీపీ వైపు మళ్లారని అర్థం అవుతోంది.
ఉదయం బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, పవన్ కలిశారు. విశాఖ సంఘటనపై మాట్లాడారు. జనసేనకు మద్దతుగా సోము వీర్రాజు స్పందించారు. ఆ తరువాత జరిగిన మంగళగిరి మీటింగ్ లో బీజేపీతో బ్రేకప్ చెప్పేలా పవన్ మాట్లాడారు. ఆ సమావేశం ముగిసిన తరువాత నోవాటెల్ కు వెళ్లిన పవన్ ను చంద్రబాబు కలిశారు. దీంతో పొత్తు ఆ రెండు పార్టీల మధ్య ఖరారు అయిందని తెలుస్తోంది. పొత్తు గురించి మాట్లాడుకునేందుకు చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారని విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరోవైపు పవన్ కు అనుకూలంగా కడప పర్యటనలో ఉన్న లోకేష్ కూడా స్పందించారు. విశాఖలో ఉద్దేశ పూర్వకంగా జనసేన కార్యకర్తలను వైసీపీ మంత్రులు రెచ్చగొట్టారని అన్నారు. అటు చంద్రబాబు ఇటు లోకేష్ ఇద్దరూ పవన్ కు మద్ధతుగా మాట్లాడడంతో టీడీపీ, జనసేన పొత్తు దాదాపుగా ఖరారు అయిందని టాక్ నడుస్తోంది.