Jagan : చంద్రబాబు పై జగన్ ఫైర్..కూటమి ప్రభుత్వం అప్పుల్లో రికార్డ్ బద్దలు
Jagan : అమరావతి పేరుతో మరో రూ. 52,000 కోట్ల అప్పు చేసేందుకు సిద్ధమవుతున్నారని, మొత్తంగా రాష్ట్రంపై రూ. 1.45 లక్షల కోట్లకు పైగా అప్పు పెరిగిందని విమర్శించారు
- By Sudheer Published Date - 01:38 PM, Thu - 6 February 25

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Jagan) తాజాగా చంద్రబాబు(Chandrababu)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే అప్పుల్లో రికార్డు స్థాయిని దాటిందని, ఏకంగా రూ. 80,000 కోట్ల అప్పు తెచ్చిందని జగన్ ఆరోపించారు. అమరావతి పేరుతో మరో రూ. 52,000 కోట్ల అప్పు చేసేందుకు సిద్ధమవుతున్నారని, మొత్తంగా రాష్ట్రంపై రూ. 1.45 లక్షల కోట్లకు పైగా అప్పు పెరిగిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలవ్వకపోతే, ఈ భారీ మొత్తాలు ఎవరికి ప్రయోజనం చేకూరుస్తున్నాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
AP Cabinet Decisions : నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ : ఏపీ కేబినెట్
ఎన్నికల హామీల అంశాన్ని జగన్ ప్రస్తావిస్తూ.. ‘సూపర్ సిక్స్’ పేరుతో ఇంటింటికీ బాండ్లు ఇచ్చి మోసం చేశారని చంద్రబాబును నిలదీశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలో చెప్పాలని జగన్ ఎద్దేవా చేశారు. కొత్త ఉద్యోగాలు లేకపోగా, ఇప్పటికే ఉన్న ఉద్యోగులను తొలగించారని, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులను కూడా తగ్గిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల గురించి ప్రస్తావిస్తూ, నలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేపట్టిన తమ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కొత్త మెడికల్ కాలేజీలు తీసుకువచ్చామని, కానీ ఇప్పుడు అవన్నీ కేంద్రానికి వ్యతిరేక లేఖలు రాయడం ద్వారా మూసివేయాలని చూస్తున్నారని జగన్ విమర్శించారు. ఇసుక, మద్యం, ఫ్లై యాష్ స్కాంలతో రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం కలుగుతుందని, ప్రభుత్వం మాఫియాలను పెంచుతుందనే ఆరోపణలు గుప్పించారు.
ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతున్నా, చంద్రబాబు ఆదాయం పెరుగుతోందని జగన్ సెటైర్లు వేశారు. ఇసుక, మద్యం విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో పేకాట క్లబ్‌లను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో సంపద సృష్టి జరగడం లేదని, రాష్ట్ర ఆదాయం ఆవిరి అవుతోందని తెలిపారు. అసలు సంపద సృష్టి అంటే చంద్రబాబుకు, ఆయన అనుచరులకు మాత్రమే లాభం వచ్చే విధంగా మారిందని జగన్ ఆరోపించారు.