Heavy Rain : ఈ 5 రోజులు మీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది – ఐఎండీ
Heavy Rain : గత రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ కోస్తా ఆంధ్రలో వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం, వాతావరణ శాఖ తెలిపాయి
- By Sudheer Published Date - 08:47 PM, Thu - 28 August 25

వర్షాల ప్రభావం ఏపీలో మళ్లీ పెరుగుతోంది. గత రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ కోస్తా ఆంధ్రలో వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం, వాతావరణ శాఖ తెలిపాయి. ఇప్పటికే ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాబోయే గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి వర్షాలకు కారణం కానుంది. దీని ప్రభావంతో గురువారం నుంచి అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు.
Telangana Sports Hub Board : క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలి – సీఎం రేవంత్
కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే సీతంపేట, మలికిపురం, భీమవరం, విజయవాడ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టంగా హెచ్చరించారు. వినాయక చవితి సందర్భంలో మండపాల నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని నదులు పొంగిపొర్లే పరిస్థితి ఏర్పడింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నీరు విడుదలవుతుండటంతో కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నాలు చేయరాదని, వినాయక నిమజ్జనాల్లో అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.