Prashant Kishor: పెగాసస్ పై ప్రశాంత్ కిషోర్ స్కెచ్..టీడీపీని మమత ద్వారా గురిపెట్టారా…?
- By HashtagU Desk Published Date - 11:15 AM, Sat - 19 March 22

ఓహో.. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్కెచ్చా! మమతతో పెగాసస్ పలుకులు పలికించింది ప్రశాంత్ కిషోరా! ఇప్పుడిదే చర్చ ఏపీలో నడుస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇజ్రాయిల్ సంస్థ నుంచి అక్రమంగా పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. దీనిని టీడీపీ వర్గాలు ఖండించాయి. కానీ లోతుగా చూస్తే.. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్కెచ్ లో భాగమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఏపీలో వైసీపీకి, బెంగాల్ లో మమతకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోరే. ఆయన వ్యూహాలన్నీ ఇలాగే ఉంటాయి. అందులోనూ ఈమధ్యకాలంలో జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఆరోపణలు, విమర్శల జోరు పెంచింది. అందుకే దానికి కౌంటర్ గా ఈ పెగాసస్ అస్త్రాన్ని ప్రశాంత్ కిషోర్ వదిలారంటున్నారు. ఆయనే మమతకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని.. అందుకే ఆమె అలా చెప్పి ఉంటారని తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపించింది.
ఏపీలో వైపీసీ గెలవాలంటే.. ప్రత్యర్థిగా ఉన్న టీడీపీని రాజకీయంగా దెబ్బతీయాలన్నది ప్రశాంత్ కిషోర్ వ్యూహంగా కనిపిస్తోంది. నాడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. ఆరోపణలు, అబద్ధాలనే సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రచారం అయ్యేలా చూడడమే ఆయన స్కెచ్. దీనికి ఉదాహరణ.. సీఐల ప్రమోషన్ అంశం. నాకు చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందినవారికే ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపించారు. సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమే అదంతా అబద్ధం అని ఒప్పుకుంది.
పెగాసస్ విషయానికి వస్తే.. చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనలేదని.. 12-08-2021న అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టంగా చెప్పారు. అయినా సరే.. ఇప్పుడు వైసీపీ ఈ అంశాన్ని రాజకీయంగా ఎలా వాడుకుంటుందో చూడాలి. దీనికి తెరవెనుక ప్రశాంత్ కిషోర్ స్కెచ్ ఎలా మారుతుందో.. దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టమో కూడా ఊహించని పరిస్థితి నెలకొందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.