Human Error : ఆ రైలు లోకోపైలట్ సిగ్నల్ జంప్ వల్లే ప్రమాదం ?!
Human Error : విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద కారణంపై కీలక విషయం వెలుగుచూసింది.
- By Pasha Published Date - 11:56 AM, Mon - 30 October 23

Human Error : విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద కారణంపై కీలక విషయం వెలుగుచూసింది. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తును ప్రారంభించామని తెలిపారు. రైల్వే ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ఫెయిల్ కాలేదని తేల్చి చెప్పారు. విశాఖ – రాయగడ ప్యాసింజర్ లోకోపైలట్ సిగ్నల్‌ను చూడకుండా.. దాన్ని దాటుకొని వేగంగా వెళ్లినందు వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. విచారణలో పూర్తి వివరాలు బయటికి వస్తాయని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
పలాస ప్యాసింజర్ ఆదివారం సాయంత్రం 5:45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరింది. అదే ట్రాక్ పై వెనుకనే రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరింది. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య కారణంగానే నెమ్మదిగా వెళ్లిందని.. ఇంతలోనే వెనుక నుంచి రాయగడ ప్యాసింజర్ వచ్చి ఢీకొట్టిందని అంటున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్ పై ఉన్న విశాఖ – పలాస (08532) రైలును.. వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో బయలుదేరిన విశాఖ – రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. ఒకే ట్రాక్ లో సిగ్నల్ క్రాస్ కాకుండా రెండు రైళ్లను ఎలా పంపించారనేది తెలియాల్సి ఉంది. 848 కి.మీ వద్ద ట్రాక్ పై నిలబడిన పలాస ప్యాసింజర్‌ను వెనుక నుంచి రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. దీంతో అక్కడే మరో ట్రాక్ పై ఉన్న గూడ్స్ రైలుపైకి బోగీలు దూసుకెళ్లాయి. దీంతో కొన్ని బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. మరికొన్ని పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 14 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. పలాస, రాయగడ ప్యాసింజర్ రైళ్లలో మొత్తం 1400 మంది ప్రయాణికులున్నట్లు (Human Error) తెలుస్తోంది.