Rains Alert : తెలంగాణ, ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- By Pasha Published Date - 10:12 AM, Sun - 21 July 24
Rains Alert : ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్రంలో వర్షసూచన ఉన్న జిల్లాల జాబితాలో.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట ఉన్నాయి. ఈ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చు. పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. ఇవాళ హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడొచ్చు. సిటీలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. నగరంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలు, 23 డిగ్రీలు మేర నమోదు కావచ్చు. ఈవివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Rains Alert) అధికారులు వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని(AP Rains) ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి వర్షం పడొచ్చు. ఈవివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఈరోజు మన్యం అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పలనాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలోని ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఏపీలో వరద ప్రభావిత జిల్లాలలో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇందుకు రూ.21.50 కోట్లు మంజూరు చేశారు.