Vijayawada : ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు
- Author : Prasad
Date : 25-05-2026 - 8:06 IST
Published By : Hashtagu Telugu Desk
వేసవి సెలవులు కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శంనం దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ఇటు ఏపీలోని రెండో అతిపెద్ద ఆలయంగా పేరొందిన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు తరలిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడం, వేసవి సెలవులు కొనసాగుతుండటంతో తెల్లవారుజాము నుంచే ఆలయానికి యాత్రికుల తాకిడి భారీగా పెరిగింది. ఉదయం 5 గంటల నుంచి రద్దీ విపరీతంగా పెరగడంతో, భక్తులకు దర్శనం సజావుగా జరిగేలా చూసేందుకు ఆలయ అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. భారీ జనసమూహాన్ని దృష్టిలో ఉంచుకుని, క్యూలలో వేగంగా కదలడానికి వీలుగా అధికారులు ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సాధారణ భక్తులు త్వరితగతిన, ఎలాంటి ఆటంకాలు లేకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉదయం 9 గంటల నుంచి అన్ని కేటగిరీల వీఐపీ దర్శనాలను కూడా రద్దు చేశారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి వి.కె. శీనా నాయక్ ప్రవేశపెట్టిన ప్రత్యేక వేసవి సహాయక కార్యక్రమానికి భక్తుల నుంచి విస్తృత ప్రశంసలు లభించాయి. మండే ఎండను తట్టుకోవడానికి యాత్రికులకు సహాయపడటానికి, ఆలయ సిబ్బంది మొబైల్ వాటర్ కంటైనర్ల ద్వారా క్యూలలో వేచి ఉన్న భక్తులకు నేరుగా చల్లటి తాగునీటిని అందించారు. ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిసి క్యూ లైన్లను సందర్శిస్తూ భక్తులతో మాట్లాడుతూ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.