AP Politics: అబ్బే మీ పాలన ఏమాత్రం బాగోలేదు.. పవన్ పార్టీలోకి వెళ్తున్న.. ఆ మంత్రి అనుచరుడి ప్రకటన..!
- By hashtagu Published Date - 10:15 AM, Tue - 22 November 22
ఏపీ మంత్రి బొత్ససత్యనారాయణ కీలక అనుచరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పాలన బాగోలేదని.. పవన్ పార్టీ జనసేనలోకి చేరుతానంటూ చెప్పారు. బొత్సకు కీలక అనుచరుడిగా ఉన్న విజయనగరం జిల్లా ప్రముఖ వ్యాపారవేత్త గురాన అయ్యలు ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఈయన..తర్వాత వైసీపీలోకి జంప్ అయ్యారు.
అయితే మంత్రి బొత్ససత్యనారాయణకు కీలక అనుచరుడిగా మెదిలిన అయ్యలు..ఈ మధ్య కాలంగా దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే తాను తాజాగా ఏపీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను త్వరలోనే జనసేనలోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. పవన్ కల్యాణ్ తో కలిసి నడవాలన్న నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈనెల 19న హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ను కలిసినట్లు చెప్పారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించే నాయకత్వం కావాలని…ఆ సమయం ఆసన్నమైందన్నారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని జనసేనలో చేరుతానని చెప్పారు. తాను మెగాఫ్యామిలీకి అభిమానినని అందుకే గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశానని చెప్పుకొచ్చారు.
అన్యాయమైన స్వార్థపూరిత రాజకీయం ఏపీలో ఉందని దాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పవన్ సిద్ధాంతాలు అందరికీ పోరాటస్పూర్తిని కలిగించేలా ఉన్నాయన్నారు. ఇతర పార్టీల్లో పనిచేస్తూ గుర్తింపు రానివారంతా జనసేనలో చేరి మద్దతు ఇవ్వాలని తెలిపారు.