AP : ఏపీలో జిల్లాల మార్పుపై ప్రభుత్వం కసరత్తు .. 26 నుంచి 32కి పెరిగే అవకాశం..!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కీలకమైన పరిణామం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, పేర్ల మార్పులు, సరిహద్దుల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు.
- By Latha Suma Published Date - 12:05 PM, Mon - 11 August 25

AP : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కీలకమైన పరిణామం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, పేర్ల మార్పులు, సరిహద్దుల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు. ఇందుకోసం ఏడుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘాంలో అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి నెలరోజుల వ్యవధిలో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజనలో కొంత గందరగోళంగా నిర్ణయాలు తీసుకున్నాయన్న అభిప్రాయం కూటమి నేతల్లో ఉంది. కొత్త ప్రభుత్వం ఈ లోటుపాట్లను సరిచేసే దిశగా కార్యాచరణను ప్రారంభించింది. దీనివల్ల ప్రస్తుతం 26గా ఉన్న జిల్లాల సంఖ్యను 32కి పెంచే అవకాశం ఉంది.
ముఖ్యమైన డిమాండ్లు
ప్రకాశం జిల్లా: పశ్చిమ ప్రాంతం — మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ ఎక్కువైంది. చంద్రబాబు ఈ మేరకు ఎన్నికల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అన్నమయ్య జిల్లా: ప్రస్తుతం రాయచోటి ప్రధాన కేంద్రంగా ఉన్నా, రాజంపేటను జిల్లాకేంద్రంగా చేయాలని స్థానికుల డిమాండ్. దీనిపై ప్రభుత్వం పునరాలోచనలో ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లా: నర్సాపురాన్ని జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం భీమవరం జిల్లా కేంద్రంగా ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లా: పుట్టపర్తిని స్థానంలో హిందూపురాన్ని జిల్లాకేంద్రంగా చేసి, జిల్లాకు “సత్యసాయి హిందూపురం జిల్లా” అని పేరు మార్చే అంశం పరిశీలనలో ఉంది.
ప్రతిపాదిత కొత్త జిల్లాలు:
అమరావతి జిల్లా: పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు చేర్పు.
మార్కాపురం జిల్లా: మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి.
గూడూరు జిల్లా: గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట.
ఆదోని జిల్లా: ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం.
పలాస జిల్లా: ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం.
మదనపల్లి జిల్లా: మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి.
ఇతర మార్పులు
కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి చేర్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రకాశం జిల్లాకు మళ్లీ అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను తిరిగి చేర్చే అవకాశాలు ఉన్నాయి. కాగా, పాలనా సౌలభ్యం, ప్రజల సేవల అందుబాటును మెరుగుపరిచే దిశగా జిల్లాల పునర్విభజన జరుగుతోంది. ప్రజల డిమాండ్లు, భౌగోళిక పరిస్తితులు, అభివృద్ధి లక్ష్యాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రివర్గ ఉపసమితి త్వరలో మరోసారి సమావేశమై తుది నివేదిక రూపొందించనున్నట్లు సమాచారం.