Aadabidda Nidhi Scheme: సూపర్ 6 లో మరో హామీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు.. ఆడబిడ్డ నిధి కింద నెలకు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో సూపర్ సిక్స్ సహా కీలక పథకాలకు నిధులు కేటాయించింది. ఇందులో ఆడబిడ్డ నిధి పథకానికి రూ.1500 చొప్పున 19 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించింది.
- By Kode Mohan Sai Published Date - 12:25 PM, Tue - 12 November 24

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తాజా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో వచ్చే నాలుగు నెలల కాలానికి సంబంధించిన ప్రణాళికలు, పథకాలు, నిధుల కేటాయింపులు చేపట్టబడ్డాయి. ముఖ్యంగా, సూపర్ సిక్స్ సహా అనేక కీలక పథకాలకు ఈ బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది.
మహిళల సాధికారత కోసం సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేస్తుండగా, మరో కీలక హామీ కూడా ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఆ హామీ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు “ఆడబిడ్డ నిధి” పేరిట నెలకు రూ. 1,500 ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం ప్రకటించింది.
కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం, ఆడబిడ్డ నిధి లేదా మహిళాశక్తి పేరిట ప్రకటించిన పథకం ఇప్పుడు 2024-25 బడ్జెట్‌లో ‘మహిళలకు ఆర్థిక సహకారం’ పేరుతో మరింత విస్తరించబడి అమలుకు సిద్ధమైంది. ఈ పథకం కింద ప్రభుత్వం వివిధ వర్గాలకు చెందిన మహిళలకు మొత్తం రూ.3,341.82 కోట్లు కేటాయించింది.
ఈ నిధులు వివిధ వర్గాల మహిళల సంక్షేమానికి కేటాయించారు:
- బీసీ మహిళలకు రూ. 1,099.78 కోట్లు
- ఎస్సీ మహిళలకు రూ. 1,198.42 కోట్లు
- గిరిజన మహిళలకు రూ. 330.10 కోట్లు
- ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ. 629.37 కోట్లు
- మైనార్టీ మహిళలకు రూ. 83.79 కోట్లు
జెండర్ బడ్జెట్‌లో ఈ నిధులను ప్రత్యేకంగా చూపించి, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.
మరోవైపు, ఎన్డీయే ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే హామీపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక ప్రకటన చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ బడ్జెట్‌లో “తల్లికి వందనం” పథకానికి రూ.6,487 కోట్లు, “అన్నదాత సుఖీభవ” పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడమేగాక, ప్రభుత్వ బడ్జెట్‌లో వాటికి సంబంధించిన నిధులు ప్రత్యేకంగా కేటాయించబడినట్లు ఆయన వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైన అనేక సవాళ్లున్నప్పటికీ, ఎన్నికల హామీలను అమలు చేసే విషయంలో ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు చెప్పారు. తమకు ముందున్న ఎన్నో సంక్షోభాల మధ్య కూడా, బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా ప్రభత్వం యొక్క దృఢమైన సంకల్పాన్ని వ్యక్తం చేశామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు మహిళలకు ప్రతి నెలా డబ్బులు వారి అకౌంట్లలో జమ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ కింద, 18 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ పథకానికి “మహాశక్తి” మరియు “ఆడబిడ్డ నిధి” పేర్లు ఖరారు చేయడం జరిగింది.
త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు ప్రకటించి, దరఖాస్తులను ఆహ్వానించే ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే మరో హామీపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి, అందువల్ల అధికారులు ఆ రాష్ట్రాలను పర్యటించి, అమలులోని విధానాలను సమీక్షించారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేసి, అమలు చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు.