Government Jobs : ఉద్యోగ నియామకాల రూల్స్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు(Government Jobs) అనుగుణంగా నియామకాలు పారదర్శకంగా, నియమబద్ధంగా, నిష్పక్షపాతంగా జరగాలి
- By Pasha Published Date - 01:52 PM, Thu - 7 November 24

Government Jobs : గత ఏడాదిన్నర వ్యవధిలో తెలంగాణలో పలు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లపై వివాదం రేగడాన్ని మనం చూశాం. ఆయా అంశాలు కోర్టు దాకా వెళ్లడాన్ని చూశాం. ఫలితంగా ఉద్యోగ నియామక ప్రక్రియల్లో నెలల తరబడి భారీ జాప్యం కూడా జరిగిపోయింది. ఈ పరిణామాలను చూస్తూ ఎంతోమంది అభ్యర్థులు మానసిక ఆవేదనకు లోనయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామక ప్రక్రియపై తాజాగా ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది.
Also Read :Rs 30000 Fine : అవి కాలిస్తే రూ.30వేల జరిమానా.. వాయు కాలుష్యంపై కేంద్రం సీరియస్
‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామక ప్రక్రియలను మొదలుపెట్టిన తర్వాత.. వాటికి సంబంధించిన నిబంధనలను మార్చడానికి వీల్లేదు. నియామక ప్రక్రియ మొదలుకావడానికి ముందున్న నిబంధనలనే.. ఉద్యోగుల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే వరకు కంటిన్యూ చేయాలి. కచ్చితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు(Government Jobs) అనుగుణంగా నియామకాలు పారదర్శకంగా, నియమబద్ధంగా, నిష్పక్షపాతంగా జరగాలి’’ అని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ‘‘ప్రభుత్వాలు అకస్మాత్తుగా ఉద్యోగ నియామక ప్రక్రియల నిబంధనలను మారిస్తే అభ్యర్థులు గందరగోళానికి, ఇబ్బందికి గురవుతారు. ఉద్యోగ పరీక్షల ప్రిపరేషన్‌పై ఫోకస్‌తో ఉండే అభ్యర్థులను ఈవిధమైన నిర్ణయాలతో ఇబ్బంది పెట్టకూడదు’’ అని దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
Also Read :Social Media Ban : 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఎందుకంటే ?
‘కె.మంజుశ్రీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ కేసులో..
‘‘2008 సంవత్సరంలో ‘కె.మంజుశ్రీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరైందే. ఆ తీర్పు తప్పు అని చెప్పడానికి అవకాశం లేదు. ప్రభుత్వాలు నియామక ప్రక్రియకు ముందే నిబంధనలను రెడీ చేసి ఆ తర్వాతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలి. ఉద్యోగ నియామక ప్రక్రియ జరుగుతుండగా.. నిబంధనలు మారిపోయే అవకాశం ఉందని ముందస్తుగా వెల్లడిస్తేనే, మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ఈవిధంగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. ఉద్యోగ నియామక రూల్స్‌ను అకస్మాత్తుగా మార్చకూడదు’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పును వెలువరించిన బెంచ్‌లో సీజేఐ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ హ్రిషికేశ్ రాయ్, జస్టిస్ పీఎన్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు.