Google to Invest : గూగుల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
Google to Invest : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో పెద్ద అడుగు పడింది. విశాఖపట్నంలో ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది
- By Sudheer Published Date - 01:52 PM, Tue - 14 October 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో పెద్ద అడుగు పడింది. విశాఖపట్నంలో ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ మధ్య రూ. 88,628 కోట్ల విలువైన అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఒక గిగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్ నిర్మాణం జరగనుంది. ఈ అగ్రిమెంట్ సంతక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, అలాగే గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది.
Assets of Government Servant : ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు చూస్తే అవాక్కవ్వాల్సిందే..
గూగుల్ ప్రతిపాదన ప్రకారం, ఈ డేటా సెంటర్‌ను 2029 నాటికి పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో అధునాతన శీతలీకరణ సాంకేతికత, పునరుత్పాదక విద్యుత్ వినియోగం, మరియు అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాలు అమలు చేయబోతున్నాయి. దీనితో విశాఖ ప్రాంతంలో సాంకేతిక, పారిశ్రామిక వాతావరణం మరింత అభివృద్ధి చెందనుంది. డేటా సెంటర్ నిర్మాణం దశలవారీగా జరగనుంది – మొదటి దశలో 500 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం ప్రారంభించి, తరువాత దానిని పూర్తి 1 గిగావాట్ కెపాసిటీకి విస్తరించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 20 వేల మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనా. అదనంగా, స్థానిక ఐటీ రంగం, స్టార్టప్‌లకు గూగుల్ భాగస్వామ్యం ద్వారా కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. విశాఖపట్నం “ఇండియా క్లౌడ్ హబ్”గా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. రాష్ట్రం పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం సృష్టించడమే కాకుండా, విద్యుత్, నీరు, మౌలిక సదుపాయాల సరఫరాలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గూగుల్ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ డిజిటల్ మ్యాప్‌లో ప్రధాన స్థానంలో నిలిపే కీలక అడుగుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.