New District : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కష్టమే…!!!
ఏపీలో ప్రస్తుతం పీఆర్సీ విషయంలో ఉద్యోగులనుంచి ప్రభుత్వం పై వచ్చిన వ్యతిరేకత ఏదైతే ఉందో.... దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే నూతన జిల్లాల అంశాన్ని జగన్ సర్కార్ తెరమీదకు తెచ్చి నోటిఫికేషన్ విడుదల చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి
- By Hashtag U Published Date - 03:55 PM, Fri - 28 January 22

ఏపీలో ప్రస్తుతం పీఆర్సీ విషయంలో ఉద్యోగులనుంచి ప్రభుత్వం పై వచ్చిన వ్యతిరేకత ఏదైతే ఉందో…. దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే నూతన జిల్లాల అంశాన్ని జగన్ సర్కార్ తెరమీదకు తెచ్చి నోటిఫికేషన్ విడుదల చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఎలా చేసినా సరే… ఇప్పుడప్పుడే కొత్త జిల్లాల ఏర్పాటు అనేది సాధ్యమయ్యేలా అయితే సూచనలు కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే… నూతన జిల్లాల ఏర్పాటుపై అనుమానాలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. అదే ఏంటంటే… ఇటీవల కేంద్రం రాసిన లేఖతో సందిగ్థత నెలకొంది.. కోవిడ్ పరిస్థితితుల కరాణంగా జనగణన ఆలస్యం అవుతోందని.. అయితే ఆ లోపు జిల్లాల సరిహద్దులు పూర్తి చేయాల్సిందేనని కేంద్రం ప్రభుత్వం మెలికి పెట్టింది. దీంతో ఇప్పట్లో న్యూ డిస్ట్రిక్ట్స్ అనేది సాధ్యమేనా అని అధికారులు ఆందోళన చెందుతున్నారని సమాచారం.
మరోవైపు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉగాది పండుగ నాటికి నూతన జిల్లాలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే… ఈ నోటిఫికేషన్ పై పెద్దగా అభ్యంతరాలు రాకపోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. కానీ, ఇప్పటికే ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఆందోళనలు రాజుకున్నాయి. కొత్తకొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలకు సంబంధించిన మరో నోటిఫికేషన్ విడుదల అనేది ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇంకోవైపు చూస్తే అధికార పార్టీకి చెందిన పలువురు వైసీపీ నేతల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో…. ఈ ప్రక్రియలో మరింత జాప్యం చోటుచేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. దీనికితోడు ఇదే టైమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల రాష్ట్రాలకు రాసిన లేఖ మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆ లేఖలో కేంద్రం స్పష్టంగా ఒక విషయాన్ని పేర్కొంది. అది ఏంటి అంటే.. 2022 జూన్ 20వ తేదీ తరువాతనే జనగణన ప్రారంభిస్తామని.. ఆ లోపే జిల్లాల సరిహద్దులు మార్చాల్సి ఉంటే.. మార్చుకోవాలని.. జనగణన డైరెక్టర్ ఆ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ.. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖలు పంపారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ఉదృతి కొనసాగుతుండటం…. దానికి సమాంతరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుండటం కారణంగానే జనగణనలో జాప్యం జరుగుతోందని జనగణన శాఖ డిప్యూటీ డైరెక్టర్ లేఖలో పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని జూన్ నాటికి జిల్లాల సరిహద్దులు మార్చినట్టు నోటిఫికేషన్ పంపించగలిగితే కుదురుతుంది… లేదంటే ఆ తరువాత కుదరదని ఆ లేఖ సారాంశం. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల ప్రక్రియ జూన్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఒకవేళ అప్పటి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే… జనగణన పూర్తైన తర్వాతే న్యూ డిస్ట్రిక్ట్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఇకపై 26 జిల్లాల ఏపీ..
ప్రస్తుతానికి 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను.. అధికార వైసీపీ సర్కార్ 26 జిల్లాలుగా మారూస్తే నోటిఫికేషన్ విడుదల చేసింది. నూతనంగా ఏర్పాటు కాబోతున్న 13 జిల్లాలతో పాటు, వాటి పేర్లు.. అలానే కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ… మంగళవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే వీటిపి ఎవరికైనా అభ్యంతరాలుంటే… వాటిని స్వీకరించేందుకు 30 రోజుల సమయమిచ్చింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలపై వచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, ఉగాది పండుగ నాటికి కొత్త నోటిఫికేషన్ వేయాలని జగన్ సర్కార్ భావించింది. కానీ, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు వ్యతిరేకంగా కొన్నిచోట్ల నిరసనలు మొదలయ్యాయి. మరికొన్ని చోట్ల ఆయా జిల్లాల పరిధిలోని స్థానికులు కొత్తకొత్త ఆంక్షలు పెడుతున్నారు. పలువురు రాజకీయ నేతలు కూడా తమకు నచ్చిన విధంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిరసన సెగలు రాజుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పుకుంటే…. కొత్త జిల్లా కేంద్రాల ఏర్పాట్లపైనే ఎక్కువగా అభ్యంతరాలు వస్తున్నాయి. ప్రస్తుత కడప జిల్లాను గమనిస్తే… అక్కడ రాజంపేట ను కాదని, రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడంపై అక్కడి రాజకీయ నేతలు, పార్టీలకు అతీతంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రాజంపేటలో పురపాలక సంఘ కార్యవర్గం మొత్తం కూడా రాజీనామాకు సిద్ధ పడిందంటేనే అక్కడి పరిస్థితి ఎలా ఉందో మనం అర్దం చేసుకోవచ్చు. ఇకపోతే… చిత్తూరు జిల్లా మదనపల్లెను జిల్లా కేంద్రంగా రాయచోటిలో కలపడం ఏంటని.. ఆ ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో కలిసిపోయిన పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలను… మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయబోయే జిల్లాలో కలపడంపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎస్ కోటను, విజయనగరంలో కలపడం… అలానే నర్సీపట్నం ను జిల్లా కేంద్రంగా చేయకపోవడంపైనా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూస్తే… ప్రజలను నుంచి ప్రభుత్వం పై వివిధ అంశాల్లో వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే… కొత్త జిల్లాల ప్రతిపాదనతో ఏపీ ప్రభుత్వం సరికొత్త నాటకానికి తెరతీసిందని విపక్ష నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు జనగణన పూర్తైతే తప్ప, నూతన జిల్లాల ఏర్పాటు అనేది సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. మరి ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో జగన్ సర్కార్ ఏ మేరకు సఫలం అవుతుందో… లేదంటే.. మరెంత వ్యతిరేకతను మూటగట్టుకుంటుందో అన్నది వేచి చూడాలి.