Female Doctor: విషాదం.. ఆస్ట్రేలియాలో తెలుగు డాక్టర్ మృతి
ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు (Female Doctor) ప్రమాదవశాత్తు వాగులో జారిపడి ప్రాణాలు కోల్పోయింది.
- By Gopichand Published Date - 10:28 AM, Sat - 9 March 24
Female Doctor: ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు (Female Doctor) ప్రమాదవశాత్తు వాగులో జారిపడి ప్రాణాలు కోల్పోయింది. కృష్ణా జిల్లాకు చెందిన ఉజ్వల వేమూరు (23) ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైథిలి, వెంకటేశ్వర్ రావు కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. డాక్టర్ కావాలనేది ఉజ్వల చిన్ననాటి కల. ఆమె ప్రస్తుతం రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ హాస్పిటల్‌లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ చేయడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read: LPG Cylinders: నేటి నుంచి ఎల్‌పీజీ సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్‌లో గ్యాస్ రేట్ ఎంతంటే..?
ఈ నెల 2వ తేదీన ఉజ్వల విశ్రాంతి కోసం స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తూ కాలుజారి వాగులో పడి అకాల మరణం చెందింది. జీవితంలో ఉన్నత స్థితిని సాధించాలనే ఆమె ఆకాంక్ష అనూహ్యంగా ముగిసింది. ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అంత్యక్రియల నిమిత్తం ఆమె పార్థివదేహాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని ఇంటికి తీసుకువస్తున్నారు. ఈ విషయం తెలియటంతో ఉజ్వల స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉజ్వల పార్థివదేహాన్ని శనివారం అంత్యక్రియల నిమిత్తం ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని ఆమె తాత మూల్పూరు రమేష్ నివాసానికి తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
We’re now on WhatsApp : Click to Join