Father and Son Died : పెంపుడు కుక్క కరిచి.. తండ్రీకొడుకు మృతి
ఎంతో ప్రేమగా సాకిన పెంపుడు కుక్కే వారి ప్రాణాలను బలిగొంది.
- By Pasha Published Date - 12:27 PM, Wed - 26 June 24

Father and Son Died : ఎంతో ప్రేమగా సాకిన పెంపుడు కుక్కే వారి ప్రాణాలను బలిగొంది. కుక్క కరవడంతో తండ్రీ, కొడుకు మృతిచెందారు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా భీమిలి జోన్ ఎగువపేటలో చోటు చేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join
59 ఏళ్ల నరసింగరావు, ఆయన కొడుకు 27 ఏళ్ల భార్గవ్‌ను వారం క్రితం పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్‌ను ముక్కు మీద, నరసింగరావు కాలు మీద కుక్క కరిచింది. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే కుక్క చనిపోయింది. దీంతో భార్గవ్, నరసింగరావు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ వేయించుకున్నారు. అప్పటికే వారిద్దరి మెదడు, కాలేయానికి రేబిస్ వ్యాధి సోకింది. దీంతో నాలుగు రోజుల క్రితం కుమారుడు మృతిచెందగా, మంగళవారం రోజున తండ్రి మరణించాడు. కుక్క కరిచిన వారం రోజుల్లోనే ఇంట్లో ఇద్దరు(Father and Son Died) చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read : SS Rajamouli : ఆస్కార్స్ అకాడమీలోకి రాజమౌళి దంపతులు.. ఇండియన్స్ జాబితా ఇదీ
దడ పుట్టిస్తున్న రేబిస్
రేబిస్ వ్యాధి పాలిచ్చి పెంచే జంతువుల (క్షీరదాల) నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. దీని బారినపడి ఏటా 150 దేశాల్లో దాదాపు 59,000 మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మొత్తం రేబిస్ మరణాల్లో 36శాతం భారత్‌లోనే నమోదవుతున్నాయి. భారత్‌లో పెద్దసంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. సకాలంలో సరైన వైద్యం తీసుకోకపోవడంతో చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి వారిలో ఎక్కువమంది 15 ఏళ్లు నిండని చిన్నారులే. రేబిస్ మరణాల విషయంలో ఢిల్లీ ప్రథమ స్థానాన్ని ఆక్రమించగా, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, తెలంగాణ అయిదో స్థానంలో నిలుస్తున్నాయి.
కొద్దినెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఏమైందంటే..
- కొద్దినెలల క్రితం ఏపీలోని కృష్ణా జిల్లాలో రేబిస్ సోకిన ఓ కుక్క పిల్లిని కరిచింది. తరవాత ఆ పిల్లి ఇద్దరు మహిళలను కరవడంతో వారిద్దరూ రేబిస్‌తో మరణించారు.
- తెలంగాణలోని ఆసిఫాబాద్‌లో కుక్కకాటుకు గురైన గేదెకు దాని యజమాని రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వలేదు. అలాగే కొద్దిరోజులు ఆ గేదె పాలను విక్రయించారు. తరవాత దూడ తల్లిపాలు తాగి మృతిచెందడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో వైద్యాధికారులు ఆ గ్రామంలో 300 మందికి రేబిస్ టీకా అందించారు.