TDP vs YCP : దళితుడిని చంపిన ఎమ్మెల్సీని సీఎం జగన్ ఎందుకు భుజాలపై మోస్తున్నారు – టీడీపీ దళిత నేతలు
దళితుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహరెడ్డి పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని టీడీపీ దళిత నేతలు నక్కా ఆనంద్‌బాబు,
- By Prasad Published Date - 10:26 PM, Sat - 14 October 23

దళితుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహరెడ్డి పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని టీడీపీ దళిత నేతలు నక్కా ఆనంద్‌బాబు, జవహర్ మండిపడ్డారు. దళితుడిని చంపి డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇప్పించి పార్టీ సభలు, సమావేశాల్లో జగన్ తన పక్కనే తిప్పుకుంటున్నారన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించిన వైసీపీ అధిష్టానం అనంతబాబును మళ్లీ ఎందుకు పార్టీలోకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించిందని ప్రశ్నించారు. బెయిల్ పై వచ్చిన అనంతబాబు తమను బెదిరిస్తున్నాడని హత్యకు గురైన సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు వాపోతున్నా వారికి కనీస రక్షణ కల్పించకపోవటంతో వారు వేరే ప్రాంతానికి వెళ్లి తలదాచుకుంటున్నారని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
హత్య చేసిన అనంతబాబు మాత్రం బహిరంగంగా ఊరేగుతున్నాడని.. వైసీపీ సభలు, సమావేశాల్లో అనంతబాబుకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడాన్ని యావత్ దళితజాతి జీర్ణించుకోలేకపోతోందన్నారు. దళిత యువకుడిని బహిరంగంగా హత్య చేసిన అనంతబాబును ముఖ్యమంత్రి ఎందుకు భుజాలపై మోస్తున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్ దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా 16.10.2023 సోమవారం నాడు కాకినాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, దళిత మేధావులు హాజరు కావాలని కోరుతున్నామని మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, జవహర్ కోరారు.