TDP : లోకేశ్ ను అడ్డుకుంటే జగన్ రెడ్డికి ప్రజలు ఘోరీ కడతారు : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు
జగన్ మోహన్ రెడ్డికి నిజంగా ప్రజలమద్ధతు ఉంటే పోలీసులు, ప్రైవేట్ సైన్యం లేకుండా ఇప్పుడు పాదయాత్ర చేయగలడా? అని
- Author : Prasad
Date : 26-09-2023 - 11:11 IST
Published By : Hashtagu Telugu Desk
జగన్ మోహన్ రెడ్డికి నిజంగా ప్రజలమద్ధతు ఉంటే పోలీసులు, ప్రైవేట్ సైన్యం లేకుండా ఇప్పుడు పాదయాత్ర చేయగలడా? అని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్ లేకుంటే టీడీపీ ఉండదని జగన్ పగటికలలు కంటున్నారని.. 70 లక్షల మంది టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి వస్తే…నువ్వూ నీకు కాపుకాస్తున్న వ్యవస్థలు ఏవీ నిలవలేవని జగన్‌మోహన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. కొడాలినాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా లాంటి సన్నాసులు జగన్ రెడ్డికి మాత్రమే నచ్చుతారని తెలిపారు. నానీ నోరు అదుపులో పెట్టుకోకుంటే ఆడవాళ్ల చేతిలో చెప్పుదెబ్బలు తింటాడని హెచ్చరించారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని తెలిపారు. లారీలు క్లీన్ చేసుకు బతికేవాడు.. గుట్కాగాడు అయిన కొడాలి నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా లాంటి వైసీపీలో ఉండే కొందరు సన్నాసులు జగన్ రెడ్డి గురించి అతిగా స్పందిస్తూ, అతనికి తొత్తులుగా మారి ఏం మాట్లాడుతున్నా రో, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారని అయన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ కుటుంబసభ్యుల మోచేతి నీళ్లు తాగి ఈ స్థితికి వచ్చావని కొడాలి నాని మర్చిపోకూడదన్నారు. టీడీపీలో 40 ఏళ్ల నుంచి తనలాంటి వారెందరమో రాజకీయాలు చేస్తున్నామని.. తాము ఎప్పుడూ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తాంగానీ బరితెగించి వ్యక్తిగత విమర్శలు చేసింది లేదన్నారు. జైలు పక్షి జగన్ రెడ్డి వచ్చాక రాజకీయాలు మొత్తం దారుణంగా తయా రయ్యాయని.. చంద్రబాబుపై, ఆయన కుటుంబసభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప వైసీపీ చేస్తున్నదేమిటి? అని ఆయన ప్రశ్నించారు. మంత్రిగా తన అధికారం ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకోవడం తెలిసినంతగా కొడాలినానీకి ప్రజల గురించి, రాష్ట్రం గురించి తెలియదన్నారు. సంస్కారం ఉన్నవారెవరూ కూడా నానీలా దిగజారి మాట్లాడరని.. ఎన్.టీ.రామా రావు గారి కుటుంబసభ్యుల మోచేతి నీళ్లు తాగి నానీ బతికాడనే విషయం తెలుగు వారిందరికీ తెలుసన్నారు. స్వర్గీయ హరికృష్ణకు టీలు మోసి, ఆయన ఆశీర్వాదంతో, చంద్ర బాబు దయతో నానీ ఇప్పుడు ఈస్థితిలో ఉన్నాడన్నారు.. నానీ లాంటి సన్నాసిని తరిమేసి, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని గుడివాడ నియోజకవర్గవాసుల్ని కోరుతున్నానని తెలిపారు. ప్రజా స్వామ్యంలో ఎవరైనా మాట్లాడొచ్చు..కానీ నానీ నువ్వు నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే ఆడవాళ్లే నిన్ను చెప్పులతో కొట్టే రోజు వస్తుందని అయన్నహెచ్చరించారు.