Bhuma vs Gangula : ఆళ్లగడ్డలో ఒంటరైన భూమా అఖిల ప్రియ.. రెండుగా చీలిన భూమా కుటుంబం..!
రాయలసీమలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు మారుపేరుగా ఉన్న ఆళ్లగడ్డలో భూమా, గంగుల
- Author : Prasad
Date : 09-03-2024 - 8:28 IST
Published By : Hashtagu Telugu Desk
రాయలసీమలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు మారుపేరుగా ఉన్న ఆళ్లగడ్డలో భూమా, గంగుల ఫ్యామిలీ మధ్య మరోసారి ఎలక్షన్ వార్ సాగబోతుంది. వైసీపీ అభ్యర్థిగా గంగుల బ్రిజేంధ్రనాథ్ రెడ్డి, టీడీపీ నుంచి భూమా నాగిరెడ్డి కుమార్తె మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బరిలోకి దిగుతున్నారు. భూమా కుటుంబంలో అఖిల ప్రియ సొంత వంశం చీలికతో ఒంటరి పోరుగా మారిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గంగుల కుటుంబం ఆళ్లగడ్డలో బలంగా ఉండటంతో పాటు ఆళ్లగడ్డ బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి వైసీపీలో చేరడంతో ఇంకా బలం పెరిగింది. దీంతో భూమా అఖిల ప్రియ ఒంటరైపోయిందనే చర్చ జరుగుతుంది. అయితే అఖిలప్రియ మాత్రం తాను శక్తివంతమైన మహిళగా అవతరిస్తానని చెప్తున్నారు. భూమా, గంగుల మధ్య కుటుంబ పోరుకు ఆళ్లగడ్డ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సహజంగానే ప్రతి ఎన్నికల సమయంలోనూ రెండు కుటుంబాల మధ్య పోరు ఉంటుంది. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి చేతిలో అఖిల ప్రియ ఓడిపోయారు. ఈసారి చాలా మంది క్యాడర్ రెండు గ్రూపులుగా విడిపోయి ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ భూమా కిషోర్‌రెడ్డి వెంట వెళ్లిపోయారు.అఖిల, కిషోర్ కుటుంబాలు బంధువులు అయినప్పటికీ ఇద్దరు మధ్య రాజకీయ వైరం ఉంది. భూమా నాగిరెడ్డి వారసత్వం తనదేనంటూ భూమా కిషోర్ రెడ్డి అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటు టీడీపీకి చెందిన ఏవీ సుబ్బారెడ్డితో అఖిల ప్రియకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అఖిల ప్రియకు తన వైపు నుంచి ఎలాంటి మద్దతు ఉండదని ఏవీ సుబ్బారెడ్డి బాహాటంగానే ప్రకటించారు. భూమా కిషోర్ రెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి అండగా ఉంటామన్నారు. AV సుబ్బారెడ్డి, భూమా కిషోర్ రెడ్డి మధ్య బంధం చాలా బలంగా ఉంది . దీనికి తోడు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఇరిగెల రాం పుల్లారెడ్డితో అఖిల ప్రియకు సఖ్యత లేదు. పొత్తులో ఉన్నప్పటికి జనసేన మాత్రం ఆమెకు వ్యతిరేకంగా పని చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ సీటు గెలుస్తామన్న ధీమాతో ఉన్న అఖిల ప్రియ ఓటర్ల మనసు గెలుచుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. తనకు ఓటర్ల మద్దతు మాత్రమే అవసరమని, నాయకులు కాదని ఆమె అన్నారు. ఓటర్లు తనకు అండగా నిలుస్తారనే నమ్మకం ఉందన్నారు.
Also Read: Seetharam Naik : బీజేపీలోకి మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ ? ఆ స్థానంలో బలమైన అభ్యర్థి