Early Election : `ముందస్తు` దిశగా లాబీయింగ్, ఢిల్లీ పెద్దల ఆహ్వానం మతలబు!
ఢిల్లీ పెద్దలు ఆహ్వానించడంతో జగన్మోహన్ రెడ్డి హస్తినకు వెళ్లారు.
- Author : CS Rao
Date : 28-12-2022 - 1:48 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయిట్మెంట్ తీసుకుని ఢిల్లీ వెళ్లారా? లేక హస్తిన బీజేపీ పెద్దల(Delhi BJP) ఆహ్వానం మేరకు ఆయన దేశ రాజధానికి వెళ్లారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. విశ్వసనీయంగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఢిల్లీ బీజేపీ పెద్దలు ఆహ్వానించడంతో హడావుడిగా మంగళవారం జగన్మోహన్ రెడ్డి హస్తినకు వెళ్లారు. అంటే, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కాదని రాజకీయవర్గాల్లోని టాక్. కేవలం రాజకీయపరమైన పర్యటనగా ప్రత్యర్థులు భావిస్తున్నారు. ముందస్తుకు(Early Election) వెళ్లడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్న క్రమంలో దిశానిర్దేశం ఇవ్వడానికి బీజేపీ పెద్దలు ఆహ్వానించి ఉంటారని సమాచారం.
Also Read : Before electons : వచ్చే ఏడాది ఏపీ, తెలంగాణ ఎన్నికలు?
ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ముందస్తు (Early Election) ఆలోచన ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. దానికి అనుగుణంగా పార్టీ ప్లీనరీ వేదికగా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి గడపగడపకు ప్రభుత్వం, మంత్రులతో బీసీ భేరి తదితర కార్యక్రమాలను పెట్టారు. ఇటీవల రెండుసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష నిర్వహించారు. మరో ఆరు నెలల గడువు ఇస్తూ ఆ లోపు గ్రాఫ్ ఏ మాత్రం పెంచుకోకపోతే టిక్కెట్ ఇవ్వలేనని తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల హడావుడి కనిపిస్తోంది. మరో ఏడాదికో, రెండేళ్లకో అంటూ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇటీవల ముందస్తుకు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఆ రోజు నుంచి ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా రాజకీయం ఊపందుకుంది.
జగన్మోహన్ రెడ్డి ముందస్తు (Early Election)
ఏపీకి రావాల్సిన బకాయిలు, పోలవరం గురించి చర్చించడానికి ఢిల్లీ వెళుతున్నట్టు సీఎంవో కార్యాలయం యథాలాపంగా చెబుతోంది. కానీ, వాటి కోసమైతే ఢిల్లీ పిలుపు ఉండదని భావిస్తున్నారు. ముందస్తు మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఢిల్లీకి పిలిపించినట్టు తెలుస్తోంది. కేంద్రం అండదండలు ఉండాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లోనూ బీజేపీ పరోక్ష మద్ధతు పలికింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మరో వైపు అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డికి సహకారం అందించారు. ఇప్పుడు ప్రతిగా కేసీఆర్ కు అండగా నిలవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అయినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల కలిసి ఒకేసారి ఎన్నికలకు వెళ్లే ప్రతిపాదన ప్రధాని నరేంద్రమోడీ వద్ద ప్రస్తావించనున్నారని విశ్వసనీయ సమాచారం.
Also Read : Election Note : ఎన్నికల వేళ 2వేల నోటుకు మూడింది.!
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధం అవుతున్నారని బీఆర్ఎస్ వర్గాల్లోని అంతర్గత చర్చ. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచిస్తూ ఇద్దరూ కలిసి ఒకేసారి ఎన్నికలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారని ఢిల్లీ వర్గాల్లోని టాక్. దీనికి తోడు నరేంద్ర మోడీ కూడా ముందస్తుకు వెళ్లనున్నారని ఇటీవల హస్తిన వేదికగా చర్చ నడిచింది. బహుశా అందుకే, జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ బీజేపీ పెద్దలు(Delhi BJP) పిలిపించారా? అనే అనుమానం కూడా ప్రత్యర్థుల్లో కలుగుతోంది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రతిపక్ష పార్టీల నేతలు పాదయాత్రలు
దేశ వ్యాప్తంగా రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. ఇంకో వైపు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలు పాదయాత్రలు, బస్సు యాత్రలకు సిద్ధం అవుతున్నారు. ఏపీలో పాదయాత్రకు లోకేష్ తేదీని ప్రకటించారు. జనసేనాని పవన్ బస్సు యాత్రకు బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసుకున్నారు. ఇక తెలంగాణలో బీజేపీ యాత్రలకు సిద్ధం అవుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు జనవరి 26న దిగుతున్నారు. ఇలా విపక్ష పార్టీల నేతలు యాత్రలకు సిద్ధమవుతోన్న తరుణంలో ముందస్తు స్పీడ్ ను ఢిల్లీ వేదికగా కేసీఆర్ తరపున కూడా జగన్మోహన్ రెడ్డి పెంచుతున్నారని సర్వత్రా వినిపిస్తోంది.
Also Read : KTR CM : కేటీఆర్ పట్టాభిషేకంపై దోబూచులాట! `ముందస్తు`కు ముడి!